Etala Rajender: సింగరేణి అవినీతిపై ఈటల సంచలన ఆరోపణలు
- బహిరంగ చర్చకు సిద్ధమంటూ ప్రభుత్వానికి సవాల్
- కోయగూడెం బ్లాక్ కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు
- పత్రికల యాజమాన్యాలను కేసీఆర్ కబ్జా చేశారని విమర్శ
సింగరేణి అవినీతిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. సింగరేణి పరిధిలోని బొగ్గు బ్లాక్ ల వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనకుండా అడ్డుకున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. కోయగూడెం బ్లాక్ గనుల కేటాయింపుల్లో కేసీఆర్ లబ్ది పొందారని ఆరోపించారు. ఈ బ్లాక్ ను అక్రమంగా అరబిందో శరత్ చంద్రారెడ్డికి కట్టబెట్టారని విమర్శించారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో ఓపెన్ కాస్ట్ గనులతో తెలంగాణను బొందలగడ్డగా మార్చారని కేసీఆర్ ఆరోపించిన విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తుచేశారు. మరి తెలంగాణ రాకముందు ఉన్న 12 ఓపెన్ కాస్ట్ గనులు ప్రత్యేక రాష్ట్రంలో 20 గనులకు ఎలా పెరిగాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి పత్రికలు, చానల్స్ యాజమాన్యాలను కేసీఆర్ కబ్జా చేశారని ఈటల ఆరోపించారు.