Navdeep: గతంలో నేను పబ్ నిర్వహించినందువల్లే నన్ను విచారించారు: నవదీప్

Navdeep talks about police questioning
  • డ్రగ్స్ కేసులో నవదీప్ ను విచారించిన పోలీసులు
  • ఏడేళ్ల నాటి కాల్ లిస్ట్ ఆధారంగా విచారిస్తున్నారన్న నవదీప్
  • అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని వెల్లడి
  • తానెప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టీకరణ
డ్రగ్స్ కేసులో నార్కోటిక్ విభాగం పోలీసుల ఎదుట హాజరైన నటుడు నవదీప్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. నార్కోటిక్ బ్యూరో అధికారులు తనను విచారించారని నవదీప్ వెల్లడించారు. ఏడేళ్ల క్రితం కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేస్తున్నారని తెలిపారు. 

"కొంత సమాచారం తెలుసుకునేందుకు రావాలని నోటీసు ఇచ్చారు. బీపీఎం అనే క్లబ్ తో నాకున్న సంబంధాలపై ఆరా తీశారు. నేను ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదు. విశాఖకు చెందిన రామ్ చందర్ వద్ద నేను డ్రగ్స్ కొనలేదు. గతంలో పబ్ నిర్వహించినందువల్లే నన్ను విచారించారు. గతంలో సిట్, ఈడీ కూడా విచారించింది. ప్రస్తుతం నార్కో పోలీసులు విచారిస్తున్నారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాను. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని అన్నారు" అని నవదీప్ వివరించారు. 

తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు అద్భుతమైన టీమ్ ను ఏర్పాటు చేశారని, తెలంగాణ నార్కో విభాగం అధికారులకు దేశంలో మంచి రికార్డు ఉందని నవదీప్ తెలిపారు. కాగా, నార్కోటిక్ బ్యూరో అధికారులు నవదీప్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
Navdeep
Police
Drugs
Hyderabad
Telangana
Tollywood

More Telugu News