Parineeti Raghav: నేడు రాఘవ్- పరిణీతిల పెళ్లి.. రెండు రాష్ట్రాల సీఎంలు హాజరు
- ఉదయ్ పూర్ చేరుకున్న కేజ్రీవాల్, భగవంత్ మాన్
- విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
- సోదరి వివాహ వేడుకకు రాలేకపోతున్న ప్రియాంక చోప్రా
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాల వివాహం ఆదివారం ఉదయ్ పూర్ లో జరగనుంది. సిటీలోని లీలా ప్యాలెస్ లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తికాగా.. శనివారం నుంచే అతిథులు ఒక్కొక్కరుగా చేరుకున్నారు. తాజాగా ఈ వివాహానికి హాజరయ్యేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉదయ్ పూర్ లో ల్యాండయ్యారు. ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో ఉదయ్ పూర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో వారిద్దరితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా కనిపించారు.
ఈ సందర్భంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. రాఘవ్, పరిణీతిలకు అభినందనలు తెలిపారు. ఆది, సోమ వారాలు వివాహ వేడుకలు జరుగుతాయని, బంధుమిత్రులంతా హాజరవుతున్నారని వివరించారు. అయితే, ఈ వివాహ వేడుకకు పరిణీతి చోప్రా సోదరి ప్రియాంక చోప్రా హాజరు కావడంలేదని సమాచారం. భర్త నిక్ జోనస్ తో కలిసి అమెరికాలో ఉంటున్న ప్రియాంక చోప్రా ముఖ్యమైన పనుల కారణంగా ఇండియా రాలేకపోతునట్లు తెలుస్తోంది. సోదరి పరిణీతికి ప్రియాంక సోషల్ మీడియా ద్వారా శనివారం శుభాకాంక్షలు తెలిపారు.