Chandrababu: సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సూటిగా జవాబులు!
- ఏ తప్పూ జరగలేదని మరోమారు వివరించిన టీడీపీ చీఫ్
- నిబంధనల ప్రకారమే నడుచుకున్నామంటూ వెల్లడి
- తొలిరోజు విచారణ 5 గంటలు.. సుమారు 50 ప్రశ్నలు
తొలిరోజు విచారణలో సీఐడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూటిగా, స్పష్టంగా జవాబిచ్చారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. విచారణలో భాగంగా మొదటి రోజు అధికారులు ఆయనను 5 గంటల పాటు విచారించారు. సుమారు 50 ప్రశ్నల వరకు సంధించగా.. అన్ని ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా జవాబిచ్చారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్ మెంట్ పోగ్రాంలో ఎలాంటి తప్పూ జరగలేదని, నిబంధనల ప్రకారమే అంతా జరిగిందని అధికారులకు మరోమారు స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి జరగకున్నా ప్రభుత్వం, అధికారులు కుంభకోణం జరిగిందంటూ ప్రచారం చేయడం బాధాకరమని అధికారుల ముందు చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.
నైపుణ్యాభివృద్ధి సంస్థలో ఘంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణల నియామకంపై అధికారులు ప్రశ్నించగా.. ప్రపంచంలోని అత్యుత్తమ సాఫ్ట్ వేర్ నిపుణులలో ఒకరుగా పేరొందడం వల్లే సుబ్బారావు నియామకం జరిగిందని చంద్రబాబు చెప్పారు. బిజినెస్ రూల్స్ కు అనుగుణంగా నియమించామని, ఆర్థికపరమైన అధికారాలు అప్పగించలేదని స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సుబ్బారావుకు మూడు కీలక పదవులు కట్టబెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన అనుభవం ఉండడంతో కె.లక్ష్మీనారాయణను నిబంధనల ప్రకారమే నియమించినట్లు వివరించారు. సంస్థ ఆడిటర్ గా వెంకటేశ్వర్లు నియామకం నైపుణ్యాభివృద్ధి సంస్థ డైరెక్టర్ల బోర్డు నిర్ణయమని చంద్రబాబు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ యువతను ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకే నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశామని అధికారులు అడిగిన ఓ ప్రశ్నకు చంద్రబాబు జవాబిచ్చారు. ఈ సంస్థ ద్వారా అత్యుత్తమ ఫలితాలు సాధించామని, శిక్షణ తీసుకున్న విద్యార్థులు మంచి ఉద్యోగాల్లో చేరారని వివరించారు. పేరుకే మంత్రివర్గం.. నిర్ణయాలన్నీ మీరే తీసుకున్నట్లు కనిపిస్తోందంటూ సీఐడీ అధికారులు ప్రశ్నించగా ముఖ్యమంత్రి కూడా మంత్రివర్గంలో ఒకరేనని చంద్రబాబు చెప్పారు. మంత్రివర్గం భేటీలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటామని, సమష్టి నిర్ణయమేనని చంద్రబాబు వివరించారు. శనివారం ఉదయం వైద్యపరీక్షల తర్వాత విచారణ ప్రారంభించిన సీఐడీ అధికారులు సాయంత్రం వరకు కొనసాగించారు. చంద్రబాబు న్యాయవాది దుమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో అధికారుల విచారణ జరిగింది.