Team India: రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై భారత జట్టు ఘనవిజయం
- ఆస్ట్రేలియాపై 99 పరుగుల భారీ తేడాతో భారత్ గెలుపు
- 140 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
- చివరలో సీన్ అబాట్ రెచ్చిపోయినా ఆస్ట్రేలియాకు తప్పని ఓటమి
ఆస్ట్రేలియాతో ఇండోర్‌లో జరిగిన రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఆసిస్‌పై 99 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మరో వన్డే మిగిలి ఉండగానే మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-0 తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది.
ఆస్ట్రేలియా 400 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే మధ్యలో వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించి 317 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఆస్ట్రేలియా 28.2 ఓవర్లలో 217 పరుగులకే అన్ని వికెట్లను కోల్పోయింది.
మన బౌలర్ల దాటికి 140 పరుగులకే ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. అయితే ఆల్ రౌండర్ సీన్ అబాట్ చివరలో దూకుడుగా ఆడాడు. 36 బంతుల్లో 54 పరుగులు చేయడంతో ఆసిస్ 217 పరుగుల వరకు వెళ్లింది. జడేజా, అశ్విన్‌లు మూడు చొప్పున, ప్రసిద్ధ కృష్ణ రెండు, షమి ఒక వికెట్ తీశారు.