Justin Trudeau: జస్టిన్ ట్రూడో మరో తప్పిదం.. యూదులకు కెనడా స్పీకర్ క్షమాపణలు

Canada Opposition leader criticises Canadian PM Trudeau for honoring nazi veteran

  • ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పర్యటన సందర్భంగా మాజీ నాజీ సైనికుడికి కెనడా పార్లమెంటులో సన్మానం
  • మాజీ సైనికుడిని ప్రశంసల్లో ముంచెత్తిన కెనడా స్పీకర్
  • ఆ తరువాత జరిగిన పొరపాటు గుర్తించి యూదులకు క్షమాపణలు
  • ఈ పొరపాటుకు ప్రధాని జస్టిన్ ట్రూడోనే కారణమని ప్రతిపక్షాల ఆరోపణ
  • ఆయన పార్టీ నిర్ణయం మేరకు ఆ సైనికుడు పార్లమెంటు ముందుకొచ్చాడని వ్యాఖ్య

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం తాజా పొరపాటు కారణంగా అక్కడి పార్లమెంటు స్పీకర్ ఆంథొని రోటా ప్రపంచంలోని యూదులందరికీ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఘటనపై ప్రతిపక్ష పార్టీ అధినేత పియెర్ పోలీవర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ట్రూడో జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తన భార్యతో సహా కెనడాను సందర్శించారు. అక్కడి పార్లమెంటులో ప్రసంగించారు. ఈ సందర్భంగా సందర్శకుల గ్యాలరీలో ఉన్న హంకా అనే మాజీ నాజీ సైనికుడిపై స్పీకర్ ప్రశంసలు కురిపించారు. హంకా నాజీ సైన్యంలో పనిచేశాడన్న విషయం అప్పటికి స్పీకర్‌కు తెలియదు. దీంతో, ఉక్రెయిన్ స్వాతంత్ర్యం కోసం పోరాడాడంటూ హంకాను స్పీకర్‌తో పాటూ ఇతర పార్లమెంటు సభ్యులు, జెలెన్‌స్కీ లేచి నిలబడి మరీ చప్పట్లో కొడుతూ ప్రశంసలు కురిపించారు. 

కానీ యూదులపై అకృత్యాలకు పాల్పడ్డ జర్మీనీ సైన్యంలో హంకా పనిచేసినట్టు ఓ యూదుహక్కుల సంస్థ తాజాగా బయటపెట్టింది. స్వయంగా యూదుడైన జెలెన్‌స్కీ సమక్షంలో హంకాను సన్మానించడంపై మండిపడింది. ఈ పొరపాటు గురించి ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్పీకర్, జెలెన్‌స్కీ ప్రపంచంలోని యూదులందరికీ క్షమాపణలు తెలిపారు. 

మరోవైపు, ఈ దారుణమైన తప్పిదానికి ప్రధాని ట్రూడో కారణమంటూ ప్రతిపక్ష పార్టీ అధినేత మండిపడ్డారు. హాంకా పార్లమెంటుకు హాజరు కావడానికి ముందే ఆయన ప్రధానితో సమావేశమయ్యారని చెప్పారు. ‘‘ఆ తరువాత పార్లమెంటు వేదికగా హంకాను సన్మానించేందుకు అధికార లిబరల్ పార్టీ నిర్ణయించింది. ఇది చాలా దారుణమైన పొరపాటు. దౌత్యపర్యటనల సందర్భంగా అతిథులుగా ఎవరిని ఆహ్వానించాలో నిర్ణయించి, అతిథుల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత ప్రధాని కార్యాలయానిదే. హంకా గురించి ముందుగానే తెలుసుకునే అవకాశం పార్లమెంటు సభ్యులు ఎవరికీ ఇవ్వలేదు. అతడి జీవితంలోని ఈ చీకటి కోణం గురించి తెలిసుంటే పార్లమెంటు వేదికగా సన్మానం జరిగి ఉండేది కాదు. ఈ ఘటనపై ట్రూడో క్షమాపణలు చెప్పాల్సిందే’’ అని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News