Motkupalli Narasimhulu: దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం.. కేసీఆర్‌పై మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు
- ఎన్టీఆర్, చంద్రబాబు సీఎంలుగా ఉండగా నేరుగా వెళ్లి కలిసేవాడినన్న మోత్కుపల్లి
- కేసీఆర్ పిలిస్తేనే బీఆర్ఎస్‌లోకి వెళ్లానని గుర్తు చేసిన నేత
- ఆరు నెలలుగా అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్నారని ఆవేదన
- చంద్రబాబు అరెస్టుపై స్పందించకుంటే కేసీఆర్‌కే నష్టమని హెచ్చరిక
‘‘ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా ఉండగా నేరుగా వారి వద్దకు వెళ్లేవాడిని. కానీ, కేసీఆర్ మాత్రం దళితుడు ఇంట్లోకి వస్తే గోమూత్రంతో శుద్ధి చేసుకునే రకం’’ అంటూ బీఆర్ఎస్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నిరసనదీక్ష చేపట్టారు. టీడీపీ నేతలు సహా పలువురు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలోని 30 నియోజకవర్గాల్లో ఏపీ నుంచి వచ్చి స్థిరపడిన వారు గెలుపోటములను ప్రభావితం చేస్తారని, చంద్రబాబు అరెస్టుపై కేసీఆర్ స్పందించకుంటే ఆయనకే నష్టమని హెచ్చరించారు. బీఆర్ఎస్‌లోకి తనంత తానుగా వెళ్లలేదని, కేసీఆర్ పిలిస్తేనే వెళ్లానని మోత్కుపల్లి గుర్తు చేశారు. ఆ తర్వాత తనను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలలుగా అపాయింట్‌మెంట్ అడుగుతున్నా ఇవ్వకుండా అవమానిస్తున్నారని అన్నారు.