Uttar Pradesh: ఏసీ ఆన్ చేసి పడుకున్న డాక్టర్.. చలికి తట్టుకోలేక చనిపోయిన ఇద్దరు నవజాత శిశువులు
- ఉత్తరప్రదేశ్‌లోని షామ్లిలో ఘటన
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- విచారణకు ఆదేశించిన ఆరోగ్యశాఖ
- కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
ఆసుపత్రిలో చల్లదనాన్ని భరించలేక ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో ఓ ప్రైవేట్ క్లినిక్‌లో నిన్న జరిగిందీ ఘటన. శనివారం రాత్రి నిద్రపోయే ముందు డాక్టర్ నీతూ గదిలోని ఏసీ పెంచారు. తెల్లారి చూస్తే శిశువులు ఇద్దరూ మృతి చెంది కనిపించినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ నీతూను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై ఆరోగ్యశాఖ విచారణకు ఆదేశించింది. నిందితుడు దోషిగా తేలితే కఠిన చర్యలు తప్పవని అదనపు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశ్వని శర్మ హెచ్చరించారు.
శిశువులు శనివారం కైరానాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జన్మించారు. అదే రోజు ప్రైవేటు క్లినిక్‌కు తరలించారు. అక్కడ చికిత్స కోసం వారిని ఫొటోథెరపీ యూనిట్‌కు తరలించారు. అక్కడ వైద్యుడు నీతూ ఏసీ ఆన్‌చేసి రాత్రంతా నిద్రపోయాడు. ఉదయం తమ చిన్నారులను చూసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులకు వారు చనిపోయి కనిపించారు. దీంతో డాక్టర్ నీతూపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.