2000 Notes: 2 వేల నోటు మార్పిడికి గడువు మరో 5 రోజులే..!
- సెప్టెంబర్ నెలాఖరుతో ముగియనున్న గడువు
- మే 19న రూ.2 వేల నోటు చలామణి నిలిపివేత
- ఇప్పటి వరకు 93 శాతం నోట్లు తిరిగొచ్చాయన్న ఆర్బీఐ
ఈ నెలాఖరుతో రూ.2 వేల నోటు మార్పిడికి గడువు ముగిసిపోతుంది. ఇప్పటికీ మీవద్ద పెద్ద నోట్లు ఉంటే వెంటనే బ్యాంకులో డిపాజిట్ చేసుకోండని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పెద్ద నోటు మార్చుకునేందుకు ఆర్బీఐ గడువును పెంచే సూచనలు కనిపించడంలేదని చెబుతున్నారు. మే 19న రూ.2 వేల నోటు చలామణిని నిలిపివేస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ప్రజలు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులలో మార్చుకోవాలని సూచించింది. ఇందుకు సెప్టెంబర్ 30 వ తేదీని గడువుగా నిర్ణయించింది. అప్పటి వరకు పెద్ద నోటు మార్కెట్లో చలామణిలో ఉంటుందని, ఆ తర్వాత చెల్లబోదని స్పష్టం చేసింది.
ఆర్బీఐ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు మార్కెట్ లోని రూ.2 వేల నోట్లలో 97 శాతం బ్యాంకులకు తిరిగొచ్చాయి. పెద్ద నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటన చేసిన 20 రోజుల్లోనే 50 శాతం నోట్లు తిరిగొచ్చాయని చెప్పింది. మార్కెట్లో ఇప్పటికీ ఉన్న మరో 7 శాతం నోట్లు ఇంకా రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద నోట్లు ఉన్న వారు తమ దగ్గర్లోని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవడమో లేక చిన్న నోట్లతో మార్చుకోవడమో చేయాలని సూచించింది.