CAG: వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధం.. కాగ్ విమర్శ
- 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు సమర్ధతపై విడుదల చేసిన సమీక్షా నివేదికలో కాగ్ విమర్శలు
- వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ 74వ సవరణ చట్టాన్ని నీరుగార్చేలా ఉందని వ్యాఖ్య
- వార్డు సచివాలయంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం లేదన్న కాగ్
- ఇది పాలన వికేంద్రీకరణను దెబ్బతీయడమేనని స్పష్టీకరణ
ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) విమర్శించింది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమలు సమర్ధతపై విడుదల చేసిన సమీక్షా నివేదికలో కాగ్ ఈ అభిప్రాయాన్ని వెల్లడించింది.
నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లోని ఈ వ్యవస్థ రాజ్యాంగం 74వ సవరణ చట్టం, ఏపీ పురపాలక చట్టాలను నీరుగార్చేలా ఉందని కాగ్ తేల్చి చెప్పింది. ఇది స్థానిక పాలనలో వికేంద్రీకరణను దెబ్బతీయడమేనని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వార్డు సచివాలయ వ్యవస్థతో వార్డు కమిటీల వ్యవస్థ అసంబద్ధంగా తయారైందని ఆక్షేపించింది. వార్డు కమిటీల ప్రయోజనాలు దెబ్బతిన్నాయని తేల్చి చెప్పింది.
వార్డు సచివాలయ వ్యవస్థను ఏపీ ప్రభుత్వం కార్యనిర్వహణ వ్యవస్థగా పేర్కొనడంపై కాగ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నికైన పాలక వర్గానికి పురపాలక కమిషనర్ ద్వారా వార్డు సచివాలయ వ్యవస్థ జవాబుదారీగా ఉంటుందన్న ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. వార్డు కమిటీలు, ప్రాంతీయ సభల్లాంటి వ్యవస్థల నిబంధనల ప్రకారం వార్డు సచివాలయంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం లేదని స్పష్టం చేసింది. రాజ్యంగ నిబంధనలు, ఏపీ పురపాలక చట్టాల అమలుకు ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొంది. అధికారులతో, సమర్ధమైన నిధుల వికేంద్రీకరణకు వ్యవస్థాగత యంత్రాంగాన్ని రూపొందించేందుకు కృషి చేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది.