Botsa Satyanarayana: త్వరలోనే ఇంటర్ విద్యార్థులకు కూడా 'జగనన్న గోరుముద్ద': బొత్స సత్యనారాయణ
- జగనన్న గోరుముద్ద పథకం దేశానికే ఆదర్శమన్న బొత్స
- జగన్ నేతృత్వంలో విద్యా శాఖలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చామని వ్యాఖ్య
- అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్నామన్న మంత్రి
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న 'జగనన్న గోరుముద్ద' పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అనుసరిస్తుండడమే దీనికి నిదర్శనమని తెలిపారు. ప్రస్తుతం ఈ పథకాన్ని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు అమలు చేస్తున్నామని... త్వరలోనే దీన్ని ఇంటర్ మీడియట్ వరకు వర్తింపజేస్తామని చెప్పారు. సీఎం జగన్ నేతృత్వంలో విద్యాశాఖలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చామని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారిపోయాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యా బోధన అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పారు.
చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి కేవలం రూ. 2,729 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని... వైసీపీ ప్రభుత్వ హయాంలో నాలుగేళ్లలోనే రూ. 6,268 కోట్లు ఖర్చు చేశామని బొత్స తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మరో రూ. 1,500 కోట్లకు పైగా ఖర్చు చేయబోతున్నామని వెల్లడించారు. ఒక్కో మండలానికి కనీసం రెండు ఉన్నత పాఠశాలలను ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించామని చెప్పారు.