Naveen Chandra: ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను: హీరో నవీన్ చంద్ర
- హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా నవీన్ చంద్ర
- మొదటి నుంచి సినిమాల పిచ్చి ఎక్కువని వ్యాఖ్య
- దర్శకులే నటన నేర్పించారని వెల్లడి
- నిలదొక్కుకోవడానికి ఎక్కువ సమయం పట్టిందని వివరణ
నవీన్ చంద్ర హీరోగా .. కేరక్టర్ ఆర్టిస్టుగా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన హీరోగా చేసిన 'మంథ్ ఆఫ్ మధు' సినిమా, అక్టోబర్ 6వ తేదీన థియేటర్లకు రానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆయన బిజీగా ఉన్నాడు. స్వాతి రెడ్డి కథానాయికగా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ దర్శకత్వం వహించాడు.
తాజా ఇంటర్వ్యూలో నవీన్ చంద్ర మాట్లాడుతూ .. "మా ఫాదర్ ఆర్టీసీలో మెకానిక్ గా చేసేవారు. నాకు మొదటి నుంచి సినిమాల పిచ్చి ఎక్కువగా ఉండేది. అదే నన్ను ఇక్కడి వరకూ తీసుకుని వచ్చింది. అంతకుముందు నాకు డాన్స్ మాత్రమే తెలుసు .. నటన తెలియదు. నాకు అవకాశం ఇచ్చిన దర్శకులే నాకు నటన నేర్పించారంటే కరెక్టుగా ఉంటుంది" అని అన్నాడు.
"ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి రావడం వలన నిలదొక్కుకోవడానికి చాలా సమయం పట్టింది. దాంతో ఒకానొక సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. డిప్రెషన్ లో నుంచి బయటికి రావడానికి రెండేళ్లు పట్టింది. ఆ తరువాత నుంచి నన్ను నేను కరెక్టు చేసుకుంటూ ముందుకు వెళుతున్నాను" అని చెప్పాడు.