Chandrababu: చంద్రబాబు జైల్లో హాయిగా కూర్చున్నారంటూ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
- బాబు అరెస్టుపై స్పందించిన మజ్లిస్ అధినేత
- జగన్ మోహన్ రెడ్డిపై విశ్వాసం ఉంచొచ్చని వ్యాఖ్య
- తెలంగాణలో మజ్లిస్ పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని సూచన
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశంపై మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ‘ఏపీలో చంద్రుడు జైల్లో ఉన్నారు. జైల్లో హాయిగా కూర్చున్నారు. ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో మీ అందరికీ తెలుసు’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రెండే పార్టీలు ఉన్నాయని, ఒకటి సైకిల్. రెండోది జగన్ మోహన్ రెడ్డి అన్నారు. జగన్ పాలన బాగుందని, ఆయనపై నమ్మకం ఉంచొచ్చని అభిప్రాయపడ్డారు.
చంద్రబాబును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని, ఆయనను ప్రజలు నమ్మొద్దని పేర్కొన్నారు. ఏపీలో మజ్లిస్ పోటీ గురించి ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా తాము పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కానీ, అన్ని చోట్లకు వెళ్లేందుకు తాను సంజీవని కాదన్నారు. ఇక తెలంగాణలో మజ్లిస్ పార్టీ పోటీ చేసిన చోట తమకే ఓటు వేయాలని.. ఇతర చోట్ల బీఆర్ఎస్‌కు వేయాలని ప్రజలను ఒవైసీ కోరారు.