KTR: లోకేశ్ ఫోన్ చేసి, హైదరాబాద్‌లో ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని అడిగారు: కేటీఆర్
- ఏపీ రాజకీయాలతో తమకేం సంబంధమన్న కేటీఆర్
- హైదరాబాద్ ఐటీ కారిడార్‌ను డిస్టర్బ్ చేయవద్దని స్పష్టీకరణ
- తెలంగాణ ఉద్యమం సమయంలోను ఐటీ కారిడార్‌లో నిరసనలు జరగలేదని వెల్లడి
- ఆంధ్రా రాజకీయాల్లో మేం తలదూర్చమని వ్యాఖ్య
- చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందన్న మంత్రి
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నిరసనలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇక్కడ ర్యాలీలు ఎందుకు, ఏపీలో చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో తమకు ఏం సంబంధమని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్టుపై ఇక్కడ ర్యాలీలు వద్దని, రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు అరెస్ట్ అయింది ఏపీలో అని, అక్కడ నిర్మోహమాటంగా చేసుకోవచ్చునని చెప్పారు. ఇక్కడ హైదరాబాద్‌లో ఎవరు చేసినా ఊరుకునేది లేదని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో ర్యాలీ చేసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారా? అని ప్రశ్నించారు. తాను లోకేశ్, జగన్, పవన్ కల్యాణ్ ముగ్గురికీ మిత్రుడినే అన్నారు. తనకు లోకేశ్ ఫోన్ చేసి, హైదరాబాద్‌లో ర్యాలీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని అడిగారని, అయితే శాంతిభద్రతల సమస్య రాకుండా ఉండాలనే అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసినట్లు చెప్పారు. ఐటీ కారిడార్ డిస్టర్బ్ కావొద్దనే అనుమతి ఇవ్వలేదన్నారు. ఈ రోజు వీరు ర్యాలీ చేస్తే, రేపు వారు ర్యాలీ చేస్తే, పోటాపోటీ ర్యాలీతో ఇక్కడ శాంతిభద్రతల సమస్య వస్తుందన్నారు. ఏపీ రాజకీయాలతో తెలంగాణకు సంబంధం లేదన్నారు.
తెలంగాణలో కొట్లాడుతామంటే ఊరుకోమని, ఏపీకి వెళ్లి పోటాపోటీగా చేసుకోండన్నారు. విజయవాడ, అమరావతి, రాజమండ్రి, కర్నూలు... ఇలా ఎన్నో ప్రాంతాల్లో ర్యాలీలు చేసుకోవచ్చన్నారు. ఇది రెండు రాజకీయ పార్టీల తగాదా అన్నారు. వారికి ఇక్కడ స్థానం లేనప్పుడు ఇక్కడ ధర్నాలు, ర్యాలీలు ఎందుకు? అని ప్రశ్నించారు. పక్కింట్లో పంచాయతీని కూడా ఇక్కడ తేల్చుకుంటామంటే ఎలా? అన్నారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని, కాబట్టి అలాగే హ్యాండిల్ చేయాలన్నారు. చంద్రబాబు అరెస్ట్ అంశం కోర్టు పరిధిలో ఉందని, ఆయన న్యాయపోరాటం చేస్తున్నారన్నారు. అక్కడ ఏం జరుగుతుందో వారు చూసుకుంటారన్నారు.
ఆంధ్రాతో తమకు తగాదాలు లేవని, ఇప్పుడు వెళ్లి తమకు అక్కడ ఉద్యమం చేయాల్సిన అవసరం లేదన్నారు. తమకు ఈ గొడవ ఎందుకన్నారు. ఇక్కడి ఏపీ ప్రజలు ఆనందంగా ఉన్నారని, వారిని ఇబ్బంది పెట్టవద్దన్నారు. ఐటీ కారిడార్‌లో తెలంగాణ ఉద్యమం సమయంలోను నిరసనలు జరగలేదని చెప్పారు. ఎందుకంటే అక్కడి వాతావరణం దెబ్బతినవద్దన్నారు. వేలాదిమంది ఆంధ్రా సోదరులు ఇక్కడకు వచ్చి పెట్టుబడులు పెడుతున్నారని, ఆ రాజకీయాల్లో మేం తలదూర్చమన్నారు. ఇక్కడి వారు ఎవరైనా ఇండివిడ్యువల్ గా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడితే మాట్లాడవచ్చునని, కానీ పార్టీకి సంబంధం లేదన్నారు. ఆ ఘర్షణలు తమకు వద్దన్నారు.