Gudivada Amarnath: ఇవిగో ఆధారాలు... ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి అమర్నాథ్

Minister Gudivada Amarnath explains AP Fibernet issue in assembly session
  • ఏపీ ఫైబర్ నెట్ అంశంలో తీవ్ర ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కారు 
  • ఎలాంటి అక్రమాలు జరగలేదంటున్న టీడీపీ
  • టెండరు ముగిసిన తర్వాత వేమూరి హరిప్రసాద్ ను ఎందుకు తొలగించారన్న అమర్నాథ్
  • స్కాం అంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందని వెల్లడి
ఏపీ ఫైబర్ నెట్ వ్యవహారంలో అక్రమాలు జరిగాయని వైసీపీ సర్కారు ఆరోపిస్తోంది. ఏపీ ఫైబర్ నెట్ లో ఎలాంటి తప్పు జరగలేదని టీడీపీ చెబుతుండగా, ఇవిగో ఆధారాలు అంటూ ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడారు. ఫైబర్ నెట్ వ్యవహారంపై నేడు అసెంబ్లీలో చర్చ చేపట్టారు. 

మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ, నాడు టెండర్ దక్కించుకున్న టెరాసాఫ్ట్ సంస్థకు, ఈ కేసులో ఏ1 వేమూరి హరికృష్ణప్రసాద్ అనే వ్యక్తికి లింకులు ఉన్నాయని అన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని తెలిపారు. 

"ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు, టెండరు ప్రక్రియ ముగిసిన తర్వాత టెరా మీడియా క్లౌడ్ సొల్యూషన్స్ నుంచి హరిప్రసాద్ తొలగించబడ్డాడు. హెరిటేజ్ సంస్థకు చెందినవారే టెరా కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్నారు. చంద్రబాబు తనకు తెలిసినవారికే టెండర్లు కట్టబెట్టారు. ఈ రూ.330 కోట్ల కుంభకోణంలో ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో జరిగింది. కాంట్రాక్టు విలువ రూ.284 కోట్ల పైచిలుకు కాగా, అందులోంచి అప్పనంగా రూ.114 కోట్లు కొట్టేశారు" అని మంత్రి వివరించారు. 

ఈ సందర్భంగా ఓ ఫ్లో చార్ట్ సాయంతో డబ్బు ఎట్నుంచి ఎటు వెళ్లిందన్నది వెల్లడించే ప్రయత్నం చేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ (ఏపీస్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్) నుంచి రూ.254 కోట్లు టెరాసాఫ్ట్ సంస్థకు వెళ్లాయని, ఇందులో రూ.117 కోట్లను ఫాస్ట్ లేన్ అనే సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. అలాగని ఫాస్ట్ లేన్ సంస్థకు ఎలాంటి అనుభవం లేదని, ఈ బిడ్డింగ్ ప్రక్రియ జరిగింది ఆగస్టులో అయితే, ఫాస్ట్ లేన్ సంస్థ 2015 సెప్టెంబరులో ప్రారంభమైందని వెల్లడించారు. 

నెటాప్స్, ఇంగ్రామ్, ఆల్టాయిస్, ఎక్స్ వై జడ్ ఇన్నోవేషన్స్, కాఫీ మీడియా తదితర షెల్ కంపెనీలు కూడా ఈ వ్యవహారంలో ఉన్నాయని, వీటిద్వారా డబ్బును బదిలీ చేయించుకున్నారని తెలిపారు. చంద్రబాబు డబ్బులు కొట్టేశారన్నదానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని మంత్రి అమర్నాథ్ ఉద్ఘాటించారు.
Gudivada Amarnath
Fibernet
APSFL
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News