Jaishankar: కెనడా, పాకిస్థాన్‌లను ఐరాస వేదికగా టార్గెట్ చేసిన జైశంకర్
- రాజకీయ సౌలభ్యం ఆధారంగా హింస, ఉగ్రవాదంపై ప్రతిస్పందన ఉండకూడదని హితవు
- అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదని వ్యాఖ్య
- వాతావరణ మార్పుల విషయంలో తప్పించుకునే ధోరణి కూడదని వెల్లడి
ఐక్యరాజ్య సమితి వేదికగా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హింస, ఉగ్రవాదాన్ని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశంలో జైశంకర్ మాట్లాడారు. రాజకీయ సౌలభ్యం ఆధారంగా హింస, ఉగ్రవాదంపై ప్రతిస్పందన ఉండకూడదని, వాటిని సమితి సభ్యదేశాలు కూడా అంగీకరించకూడదన్నారు.
ఒక దేశ ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కావొద్దన్నారు. టీకాల విషయంలో వర్ణ వివక్ష వంటి అన్యాయాలను మళ్ళీ అనుమతించకూడదన్నారు. వాతావరణ మార్పుల విషయంలో తప్పించుకునే ధోరణి సరికాదన్నారు. పేద దేశాల నుంచి ధనిక దేశాల వరకు ఆహారం, ఇంధనం అందించేందుకు మార్కెట్ శక్తులను ఉపయోగించకూడదన్నారు. రాజకీయ సౌలభ్యం ఆధారంగా ఉగ్రవాదం, హింసపై ప్రతిస్పందించడాన్ని అనుమతించకూడదన్నారు.
అదేవిధంగా ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం ఉండకూడదన్న విషయం కొన్ని దేశాలకే పరిమితం కాకూడదన్నారు. జమ్మూ కశ్మీర్ అంశంపై ఇటీవల పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఐక్యరాజ్య సమితిలో చేసిన వ్యాఖ్యలు, ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెంట్ల హస్తం ఉందన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలను ఉద్దేశించి జైశంకర్ ఈ విధంగా మాట్లాడినట్లుగా తెలుస్తోంది.