Rohit Sharma: టీమిండియా బ్యాకప్ కు ఢోకా లేదు... వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మ వ్యాఖ్యలు
- వచ్చే నెలలో భారత్ లో వరల్డ్ కప్ ప్రారంభం
- తుది జట్లను ప్రకటించేందుకు గడువు సెప్టెంబరు 28
- వరల్డ్ కప్ కు ఎంపిక చేసిన అక్షర్ పటేల్ కు గాయం
- ఆసీస్ తో తొలి రెండు వన్డేల్లో రాణించిన అశ్విన్
- అక్షర్ కోలుకోకపోతే వరల్డ్ కప్ టీమ్ లో అశ్విన్ కు అవకాశం!
అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు భారత్ లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే దేశాలు తమ తుది 15 మందితో కూడిన జట్లను ప్రకటించేందుకు గడువు సెప్టెంబరు 28తో ముగియనుంది.
అయితే, భారత్ ప్రకటించిన వరల్డ్ కప్ జట్టులోని సభ్యుడు అక్షర్ పటేల్ ఇటీవల గాయపడి, ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. గడువు లోపల అక్షర్ పటేల్ ఫిట్ నెస్ సాధించలేకపోతే, అతడి స్థానంలో సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను ఎంపిక చేసే అవకాశాలున్నాయి.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడే టీమిండియాకు ఎంపికైన అశ్విన్ తొలి రెండు వన్డేల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. తొలి మ్యాచ్ లో ఒక వికెట్ తీసిన అశ్విన్, రెండో మ్యాచ్ లో 3 వికెట్లతో సత్తా చాటాడు.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రేపు రాజ్ కోట్ లో ఆసీస్ తో చివరి వన్డే జరగనుండగా, రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. అశ్విన్ బౌలింగ్ లో క్లాస్ ఉంటుంది, పైగా అనుభవజ్ఞుడు కూడా అని కొనియాడాడు. అశ్విన్ వంటి ఆటగాడు ఈ విధమైన ఫామ్ లో ఉంటే వరల్డ్ కప్ సందర్భంగా టీమిండియా బ్యాకప్ కు ఢోకా లేదని ధీమా వ్యక్తం చేశాడు.
ఒకవేళ ఎవరైనా ఆటగాడు టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చినా, అశ్విన్ వంటి మెరుగైన ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారని తెలిపాడు. అశ్విన్ కొంతకాలంగా వన్డేల్లో ఆడకపోయినప్పటికీ, అతడి అనుభవాన్ని తక్కువ అంచనా వేయలేమని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. గత రెండు వన్డేల్లో అశ్విన్ ప్రదర్శనే అందుకు నిదర్శనం అని తెలిపాడు.