Dipendra Singh AIree: 9 బంతుల్లో 50 పరుగులు చేసి చరిత్ర సృష్టించిన నేపాల్ బ్యాట్స్ మన్ దీపేంద్ర సింగ్

Nepal batsman Dipendra Singh Airee makes world fastest fifty by making 50 runs in 9 balls
  • చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ఆసియా క్రీడలు
  • ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ లో నేడు నేపాల్, మంగోలియా పోరు
  • అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేసిన నేపాల్ బ్యాటర్
  • ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక స్కోరు రికార్డు కూడా నేపాల్ కైవసం
చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఇవాళ పరుగుల వర్షం కురిసింది. హేమాహేమీ జట్లకు సాధ్యం కాని రికార్డును పసికూన నేపాల్ సాధించింది. 

హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో క్రికెట్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మహిళల టైటిల్ ను భారత్ చేజిక్కించుకుంది. ప్రస్తుతం పురుషుల విభాగం పోటీలు జరుగుతున్నాయి. టీ20 ఫార్మాట్లో ఈ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు.

కాగా, ఇవాళ నేపాల్, మంగోలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పలు రికార్డులు నమోదయ్యాయి. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 314 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇదే అత్యధిక స్కోరు. అంతేకాదు, ఈ ఇన్నింగ్స్ లో 26 సిక్స్ లు బాదిన నేపాల్... ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్స్ లు నమోదు చేసిన జట్టుగానూ రికార్డు పుటల్లోకెక్కింది. 

ఇదే మ్యాచ్ లో నేపాల్ బ్యాట్స్ మన్ దీపేంద్ర సింగ్ ఐరీ కేవలం 9 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. మొత్తమ్మీద ఐరీ 10 బంతుల్లో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 

గతంలో ఈ రికార్డు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్  పేరిట ఉంది. యువీ 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో 12 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఆ సమయంలోనే ఇంగ్లండ్ పేసర్ స్టూవర్ట్ బ్రాడ్ విసిరిన ఓ ఓవర్లో ఆరు బంతులను సిక్స్ లు గా మలిచి ఔరా అనిపించాడు. 

ఇక, మంగోలియాతో మ్యాచ్ లో నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా భారీ సెంచరీ నమోదు చేశాడు. మల్లా 50 బంతుల్లో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో 8 ఫోర్లు, 12 భారీ సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ సైతం బ్యాట్ ఝళిపించాడు. పౌడెల్ 27 బంతుల్లో 61 పరుగులు చేశాడు. 

మల్లా సెంచరీ, ఐరీ రికార్డు అర్ధసెంచరీ, కెప్టెన్ పౌడెల్ సమయోచిత ఇన్నింగ్స్ సాయంతో భారీ స్కోరు నమోదు చేసిన నేపాల్... ఆపై మంగోలియాను స్వల్ప స్కోరుకే కట్టడి చేసింది. 315 పరుగుల భారీ లక్ష్యఛేదనలో మంగోలియా 13.1 ఓవర్లలో 41 పరుగులకే కుప్పకూలింది. తద్వారా నేపాల్ 273 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.
Dipendra Singh AIree
World Fastest Fifty
Nepal
Mangolia
Asian Games
T20 Cricket

More Telugu News