Vijayasai Reddy: చంద్రబాబు ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేయడంపై విజయసాయిరెడ్డి స్పందన
- ఎక్స్ వేదికగా క్వాష్ పిటిషన్లు, ముందస్తు బెయిల్ పిటిషన్లపై స్పందించిన వైసీపీ ఎంపీ
- మాజీ మంత్రులు, మాజీ అధికారులు, బినాములు సుప్రీం కోర్టు దాకా ప్రయత్నిస్తున్నారని విమర్శ
- నిర్దోషులైతే దర్యాఫ్తును ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటకు రావాలని సవాల్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. చంద్రబాబుతో పాటు దోపిడీలో భాగస్వాములైన వారు ఏసీబీ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు బెయిల్ అంటూ వెళ్తూ కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
'చంద్రబాబు గారు, ఆయన కుమారుడి దోపిడీలో భాగస్వాములైన మాజీ మంత్రులు, మాజీ అధికారులు, బినామీల ముందస్తు బెయిళ్లు, స్క్వాష్ పిటిషన్లతో ఏసీబీ కోర్టు నుంచి సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వరకు కోర్టుల సమయాన్ని హరిస్తున్నారు. మీరు నిజంగా నిర్దోషులైతే దర్యాప్తును ఎదుర్కొని కడిగిన ముత్యంలా బయటపడొచ్చు కదా?' అని ట్వీట్లో విజయసాయి ప్రశ్నించారు.