Mobile Blast: చార్జింగ్‌లో ఉన్న మొబైల్ పేలి.. కిటికీ అద్దాలు, సామాన్లు ధ్వంసం.. ఒకరి పరిస్థితి విషమం
- మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘటన
- పొరుగింటి తలుపులు, కిటికీలు కూడా ధ్వంసం
- ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు క్షతగాత్రులు
- గతంలో మొబైల్ పేలి పలువురి మృత్యువాత
చార్జింగులో ఉన్న ఫోన్ బాంబులా పేలి ఇంటి కిటికీ అద్దాలు, సామాన్లు ధ్వంసమైన ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. ఈ ఘటనలో ఇంట్లోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాదు, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాసిక్ ప్రతాప్‌నగర్‌లోని సిడ్కో ప్రాంతానికి చెందిన తుషార్ జగ్‌తాప్, శోభా జగ్‌తాప్, బాలకృష్ణ సుతార్ నివసిస్తున్నారు. నిన్న ఉదయం వీరిలో ఒకరు తమ మొబైల్‌కు చార్జింగ్ పెట్టారు.
ఆ తర్వాత కాసేపటికే అది భారీ శబ్దంతో బాంబులా పేలింది. దీంతో ఇంట్లోని కిటికీ అద్దాలతోపాటు సామాన్లు ధ్వంసమయ్యాయి. పొరుగింటి ఇళ్ల కిటికీలు, తలుపులు కూడా దెబ్బతిన్నాయి. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ మొబైల్ ఫోన్లు పేలిన ఘటనలు ఉన్నప్పటికీ ఈ స్థాయిలో పేలుడు సంభవించడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో మొబైల్ ఫోన్ పేలి కేరళలోని త్రిసూర్‌లో 8 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఫోన్‌లో వీడియో చూస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఫిబ్రవరిలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. చార్జింగ్‌లో ఉన్న మొబైల్‌ను ఉపయోగిస్తుండగా పేలడంతో 68 ఏళ్ల వృద్ధుడి ముఖం, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత చికిత్స పొందుతూ అతడు మరణించారు. గతేడాది ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చార్జింగ్ మోడ్‌లో ఉన్న మైబైల్ పేలడంతో 8 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.