peanut chikki: ఈ వీడియో చూస్తే పల్లీ చిక్కీ తినడానికి ధైర్యం చాలదు!
- అన్ బ్రాండెడ్, లోకల్ పల్లీ చిక్కీలు తినకపోవడమే మంచిది
- అపరిశుభ్ర వాతావరణంలో వీటి తయారీ
- ఇందుకు సంబంధించి వెలుగు చూసిన ఓ వీడియో
మనలో చాలా మంది పల్లీ చిక్కీని ఇష్టంగా తింటుంటారు. ఇది మంచి పోషకాహారం కూడా. ప్రోటీన్, ఫైబర్ అధికంగా లభిస్తుంది. సాయంత్రం స్నాక్ గా, సమయానికి ఆహారం తీసుకోలేని సందర్భాల్లోనూ దీన్ని తింటుంటారు. అలాంటి వారు ఇంట్లోనే పల్లీ చిక్కీ చేసుకుని తినడమే ఆరోగ్యకరం. బయట షాపుల్లో విక్రయించే వాటిని, ముఖ్యంగా అన్ బ్రాండెడ్ లోకల్ పల్లీ చిక్కీని తినకుండా ఉండడమే నయమని ఈ వీడియోని చూస్తే అర్థం చేసుకోవచ్చు.
పల్లీ చిక్కీని తయారు చేస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. బెల్లం పాకం, పల్లీల మిశ్రమాన్ని నేలపై పోసి రేకుల సాయంతో వాటిని చిన్న చిన్న అచ్చులుగా మారుస్తుండడం ఇందులో కనిపిస్తోంది. చేస్తున్న ప్రదేశం ఏమంత శుభ్రంగా లేదు. పైగా పల్లీ చిక్కీని అచ్చులుగా మార్చే కార్మికులు కూడా చేతులకు ఎలాంటి గ్లౌజులు వేసుకోలేదు. పల్లీల చిక్కీ పరిశ్రమలు ఎంత అపరిశుభ్రంగా ఉంటాయో ఇది తెలియజేస్తోంది. పాత్రలు ఉపయోగించకుండా, నేలపై పోసి చేస్తున్నారంటే వారికి శుభ్రత గురించి ఏ మాత్రం పట్టనట్టుంది. నిజానికి ఇది చట్టవిరుద్ధం కూడా.
అందుకని పల్లీ చిక్కీ తినేవారు ఇక మీదట బయట కొనుగోలు చేయకుండా.. ఇంట్లోనే చక్కగా చేసుకుని తినడమే ఆరోగ్యానికి మంచిదని అర్థం చేసుకోవచ్చు. ఇన్ స్టా గ్రామ్ లో ఈ వీడియోను ఒకరు పంచుకోవడంతో వైరల్ గా మారింది. దీనిపై తోటి యూజర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండడాన్ని గమనించొచ్చు. (వీడియో కోసం)