Vishal: కేంద్ర సెన్సార్ బోర్డులో లంచగొండితనాన్ని బట్టబయలు చేసిన హీరో విశాల్
- విశాల్ హీరోగా మార్క్ ఆంటోని
- సెప్టెంబరు 15న రిలీజ్
- హిందీ వెర్షన్ విడుదల కోసం డబ్బు ఇవ్వాల్సి వచ్చిందన్న విశాల్
- ఇద్దరు వ్యక్తులకు రూ.6.5 లక్షలు చెల్లించానని వెల్లడి
- ఆధారాలను సోషల్ మీడియాలో పంచుకున్న వైనం
తమిళ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదల కోసం తాను కేంద్ర సెన్సార్ బోర్డులోని కొందరు వ్యక్తులకు డబ్బు ఇవ్వాల్సి వచ్చిందని హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో వివరంగా స్పందించారు.
"వెండితెరపై అవినీతిని చూపించడం బాగానే ఉంటుంది. కానీ నిజ జీవితంలో అవినీతి దారుణంగా ఉంటుంది... ఏమాత్రం జీర్ణించుకోలేం. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి హేయమైన చర్య. మరీ ముఖ్యంగా ముంబయిలోని సీబీఎఫ్ సీ (కేంద్ర సెన్సార్ బోర్డు) ప్రధాన కార్యాలయంలోనే అవినీతి జరిగితే ఇంకేం చెప్పాలి?
నేను నటించిన మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ విడుదల చేసేందుకు రూ.6.5 లక్షలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ కు రూ.3.5 లక్షలు, సినిమా ప్రదర్శించుకునేందుకు మరో రూ.3 లక్షలు... రెండు ట్రాన్సాక్షన్లలో చెల్లించాను. నా కెరీర్ లో ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. సినిమా రిలీజ్ కాకపోతే నష్టపోతామన్న తప్పనిసరి పరిస్థితుల్లో, మరో మార్గం లేక, మేనకా అనే మధ్యవర్తి ద్వారా డబ్బు చెల్లించాల్సి వచ్చింది.
ఈ వ్యవహారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రిల దృష్టికి తీసుకువస్తున్నాను. నా సంగతి వదిలేయండి... భవిష్యత్తులో ఇతర నిర్మాతలకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదనే ఈ విషయాలను బయటపెడుతున్నాను. నేను కష్టపడి సంపాదించిన సొమ్మును అవినీతిపరుల పాల్జేస్తానా... అది జరగని పని! చెల్లింపులు చేశాం అనడానికి పక్కా ఆధారాలున్నాయి. ఎల్లప్పుడూ సత్యమే గెలుస్తుంది" అంటూ విశాల్ పేర్కొన్నారు.
తన పోస్టుకు ప్రధాని నరేంద్ర మోదీని, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేను ట్యాగ్ చేశారు. అంతేకాకుండా... ఎం.రాజన్, జీజా రామ్ దాస్ అనే వ్యక్తులకు నగదు చెల్లించినట్టు బ్యాంకు ఖాతాల వివరాలను కూడా విశాల్ పంచుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో కూడా విడుదల చేశారు.