Nara Brahmini: ఇతర రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఎందుకు పని చేస్తోంది?: నారా బ్రాహ్మణి
- వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించిన నారా బ్రాహ్మణి
- స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగాల కల్పనలో ఏపీని చంద్రబాబు అగ్ర స్థానంలో నిలిపారని ప్రశంస
- వైసీపీ పుష్ ఔట్.. పుష్ ఇన్ పాలసీ వల్ల సంస్థలన్నీ తెలంగాణకు వెళ్తున్నాయని విమర్శ
ఓ వైపు టీడీపీ అధినేత, తన మామ చంద్రబాబు జైల్లో ఉన్నారు. మరోవైపు తన భర్త నారా లోకేశ్ ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారనే ప్రచారాన్ని వైసీపీ నేతలు చేస్తున్నారు. ఈ క్రమంలో, పార్టీని లీడ్ చేసే దిశగా నారా బ్రాహ్మణి అడుగులు వేస్తున్నారు. ఏనాడూ పాలిటిక్స్ ను పట్టించుకోని ఆమె... ఇప్పుడు రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ... ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఎందుకు పని చేస్తోందని ఆమె ప్రశ్నించారు.
స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగాల కల్పన, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లలో ఏపీని చంద్రబాబు అగ్ర స్థానంలో నిలిపి, మనందరం గర్వపడేలా చేశారని బ్రాహ్మణి చెప్పారు. వైసీపీ ప్రభుత్వ 'పుష్ ఔట్.. పుష్ ఇన్' పాలసీ కారణంగా అమరరాజా నుంచి లులూ వరకు సంస్థలన్నీ ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లిపోయాయని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై జాతీయ మీడియా 'ది ప్రింట్'లో వచ్చిన కథనాన్ని ఆమె షేర్ చేశారు.