Guntur District: ఆత్మహత్యకు ప్రేరేపించిన మానసిక కుంగుబాటు.. కుమార్తెను చంపి తల్లి ఆత్మహత్య
- గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన
- పెళ్లికి ముందునుంచే బాధితురాలికి మానసిక సమస్యలు
- నాటువైద్యం చేయిస్తున్న కుటుంబ సభ్యులు
- భర్త ఆఫీసుకు వెళ్లాక కుమార్తెను చంపి కత్తితో గొంతుకోసుకున్న మహిళ
మానసిక సమస్యలతో కుంగిపోయిన ఓ మహిళ మూడేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. తగరం అరుణ్‌కుమార్-జోజి రాణి (32) భార్యాభర్తలు. 2015లో వివాహమైంది. వీరికి మూడేళ్ల క్రితం మేరీ జెస్సీ జన్మించింది. పెళ్లయిన ఐదేళ్లకు పుట్టడంతో కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. అరుణ్‌కుమార్ తాడేపల్లిలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేస్తుండగా రాణి ఇంటి వద్దనే ఉంటూ చిన్నారిని చూసుకుంటోంది. రాణి మానసిక పరిస్థితి కొన్నాళ్ల క్రితం దెబ్బతింది. నాటువైద్యం చేయిస్తున్నా పరిస్థితిలో మార్పు రాలేదు.
నేను చనిపోతా..
మానసిక వ్యాధితో నిత్యం కుంగిపోతున్న రాణి తనకు చనిపోవాలని ఉందని పలుమార్లు తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఆమెను వారిస్తూ వచ్చారు. నిజానికి ఆమెకు పెళ్లికాక ముందే ఈ సమస్య ఉందని, అప్పట్లో ఓసారి ఆత్మహత్యకు కూడా యత్నించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న ఉదయం భర్త ఆఫీసుకు వెళ్లిపోగా రాణి ఇంట్లోనే ఉంది. ఆఫీసుకు వెళ్లిన అరుణ్‌కుమార్ ఉదయం 10 గంటల సమయంలో భార్యకు ఫోన్ చేశాడు. ఎన్నిసార్లు చేసినా స్పందన లేకపోవడంతో సమీపంలోనే ఉండే బావమరిదికి ఫోన్ చేసి విషయం చెప్పి ఇంటికి వెళ్లి చూడమన్నాడు. వెంటనే వెళ్లిన అతడికి ఇంటి తలుపులు వేసి కనిపించాయి.
తలుపులు బద్దలుగొట్టి ఇంట్లోకి
ఎన్నిసార్లు తట్టినా తీయకపోవడంతో తండ్రితో కలిసి తలుపులు బద్దలుగొట్టి లోపలికి ప్రవేశించాడు. లోపల కనిపించిన దృశ్యం చూసి ఇద్దరూ కుప్పకూలిపోయారు. చిన్నారి జెస్సీ, రాణి ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు.
చార్జర్ వైరుతో కుమార్తెను గొంతు బిగించి
ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించిన రాణి తొలుత కుమార్తెను చార్జర్ వైరుతో గొంతుబిగించి చంపేసింది. ఆ తర్వాత వంటింట్లోని కత్తితో మెడపైనా, ఎడమ మణికట్టుపైనా కోసుకుని ఆత్మహత్య చేసుకుంది. మానసిక సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.