Team India: నాలుగేళ్లకు వీడిన మిస్టరీ.. పంత్ భుజంపై ఆ చేయి ఎవరిదో తేలింది!
- 2019 ప్రపంచ కప్ సందర్భంగా పంత్, ధోనీ, మయాంక్, బుమ్రాతో పాండ్యా సెల్ఫీ
- ఆ ఫొటోలో పంత్ పై చేయి ఎవరిది అనేది మిస్టరీగా మారిన వైనం
- పంత్ భుజాలపై చేయి తనదే అని వెల్లడించిన మయాంక్
రిషబ్ పంత్ భుజంపై ఆ చేయి ఎవరిది? నాలుగేళ్ల నుంచి భారత క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేసి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రశ్న ఇది. ఇండియన్ క్రికెట్ సర్కిల్ అభిమానుల్లో ఈ అతి పెద్ద మిస్టరీ ఎట్టకేలకు వీడింది. అసలు ఈ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే నాలుగేళ్లు వెనక్కి వెళ్లాలి. 2019 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా తీసిన ఓ సెల్ఫీ ఫొటోతో ఇది ప్రారంభమైంది. ఇందులో రిషబ్ పంత్, మహేంద్ర సింగ్ ధోనీ, బుమ్రా, మయాంక్ అగర్వాల్ తో కలిసి హార్దిక్ పాండ్యా సెల్ఫీ తీసుకొని దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలో కుడివైపున చివర్లో నిల్చున్న రిషబ్ పంత్ భుజంపై ఉన్న ఒకరు చేయి వేశారు. కానీ, ఫొటోలో ఆ చేయి ఎవరిదో ఎవ్వరికీ అర్థం కాలేదు. దాంతో, పంత్ భుజంపై ఆ చేయి ఎవరిది? అనే హ్యాష్ ట్యాగ్ అప్పట్లో ట్రెండ్ అయింది.
ఫొటోలోని ఐదుగురు క్రికెటర్లు దీనికి సమాధానం చెప్పకపోవడంతో ఈ ప్రశ్న మిస్టరీగా మారింది. అయితే నాలుగేళ్ల సస్పెన్స్ కు తెరదించుతూ మయాంక్ అగర్వాల్ ఈ మిస్టరీ గుట్టు విప్పాడు. పంత్ పై ఆ చేయి తనదే అని వెల్లడించాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆ ఫొటోతో పాటు ఓ పోస్ట్ ను షేర్ చేశాడు. ‘సంవత్సరాల విస్తృతమైన పరిశోధనలు, చర్చలు, లెక్కలేనన్ని సిద్ధాంతాల తర్వాత రిషబ్ పంత్ భుజాలపై ఉన్న చేతులు నావే నని ఈ రోజు దేశానికి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నాడు. దీనిపై సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నాడు. ‘2019 ప్రపంచకప్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఇప్పుడు మేం 2023 ప్రపంచ కప్ నకు పూర్తిగా సిద్ధమయ్యాం’ అని ఓ వ్యక్తి పేర్కొన్నాడు.