Karnataka Bandh: కర్ణాటక బంద్ తో జనజీవనం అస్తవ్యస్తం
- బెంగళూరు, మైసూర్, మాండ్య ప్రాంతాల్లో ఎక్కువ ప్రభావం
- మూత పడ్డ వ్యాపార సంస్థలు.. స్కూళ్లు, కళాశాలలకు సెలవు
- బంద్ కు 2,000 సంస్థల మద్దతు
కర్ణాటక బంద్ ప్రజలకు కష్టాలు తెచ్చి పెట్టింది. కన్నడ ఒక్కుట సంస్థ పిలుపు మేరకు శుక్రవారం కర్ణాటక వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుండగా.. బెంగళూరు విమానాశ్రయం నుంచి 44 విమాన సర్వీసులు (రాను, పోను) రద్దు అయ్యాయి. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కన్నడ ఒక్కుట సంస్థ బంద్ కు పిలుపునిచ్చింది. ఎన్నో సంఘాలతో కూడిన ఉమ్మడి వేదికే కన్నడ ఒక్కుట.
బంద్ తో ఎక్కువ ప్రభావం బెంగళూరు నగరంపైనే పడింది. ప్రజల రవాణాకు అవరోధం ఏర్పడింది. కన్నడ ఒక్కుట సంస్థ కార్యకర్తలు విమానాశ్రయంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం చేయగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంద్ కారణంగా చాలా మంది ప్రయాణికులు తమ విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. దీంతో విమాన సర్వీసులను ఎయిర్ లైన్స్ రద్దు చేస్తున్నాయి. క్యాబులు అందుబాటులో లేకపోవడంతో చాలా మంది సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేకపోయారు.
కర్ణాటకలోని దక్షిణ ప్రాంతంపై బంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. బంద్ ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు తోపాటు మైసూర్, మాండ్య ప్రాంతాల్లో బంద్ కారణంగా ప్రజా జీవనం స్తంభించింది. వ్యాపార సంస్థలు చాలా వరకు మూతపడ్డాయి. కర్ణాటక బంద్ కు సుమారు 2,000 వరకు సంస్థలు మద్దతు నిస్తున్నాయి. బంద్ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు.