Congress: కాలేజీ విద్యార్థులకు తెలంగాణ కాంగ్రెస్ బంపర్ హామీ.. మరిన్ని ప్రజాకర్షక హామీలు!
- వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు
- ఇప్పటికే పలు ఆకర్షక హామీల ప్రకటన
- ఉద్యోగ దరఖాస్తు ఫీజును రూ. 10కు తగ్గించే యోచన
తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు ఆకర్షక హామీలు ప్రకటించింది. తాజాగా, మరిన్ని హామీలకు రెడీ అవుతోంది. కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ఇంటర్నెట్ అందించడంతోపాటు ఉద్యోగ దరఖాస్తు ఫీజు రూ. 5, రూ. 10 తగ్గించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
చైర్మన్ శ్రీధర్‌బాబు అధ్యక్షతన నిన్న గాంధీభవన్‌లో ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్‌కుమార్ తదితర నేతలు పాల్గొన్నారు. ప్రజలు, విద్యార్థులు, యువత సంక్షేమానికి ఎలాంటి హామీలు ఇవ్వాలన్న దానిపై కమిటీ చర్చించింది. ఆటోడ్రైవర్లకు ఉపయోగపడేలా ప్రత్యేక పథకాన్ని రూపొందించాలని కమిటీ నిర్ణయించింది.
ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకు ఎల్లుండి (అక్టోబరు 2న) ఉదయం ఆదిలాబాద్‌లో, సాయంత్రం నిజామాబాద్ జిల్లాలో పర్యటించాలని కమిటీ నిర్ణయించింది. మిలటరీ, సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేయాలని వారి తరపున వచ్చిన వారు నిన్న కమిటీకి వినతిపత్రం అందించారు.