khalisthan: స్కాట్లాండ్లోనూ ఖలిస్థానీల ఆగడాలు.. గురుద్వారాలోకి వెళ్లకుండా భారత రాయబారి అడ్డగింత
- కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ హత్య
తర్వాత ముదిరిన వివాదం - కెనడా–భారత్ మధ్య దౌత్య వివాదం
- ఇతర దేశాల్లోనూ భారత దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకున్న ఖలిస్థానీ అనుకూల వర్గాలు
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తోంది. ఈ వివాదం ఇతర దేశాల్లోని భారత రాయబారులకు కూడా ఇబ్బంది కలిగిస్తోంది. యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లోని భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి స్కాట్లాండ్లోని గురుద్వారాలోకి వెళ్లకుండా కొందరు అడ్డుకున్నారు. దొరైస్వామిని అడ్డగించిన రాడికల్ బ్రిటిష్ సిక్కు కార్యకర్తల బృందం గురుద్వారాలో ఆయనకు ఆహ్వానం లేదని చెప్పింది.
దొరైస్వామి ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారాకు చెందిన కమిటీతో సమావేశాన్ని ప్లాన్ చేసినట్లు తెలుసుకున్న కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆయనను అడ్డగించారు. గురుద్వారాలోకి వెళ్లేందుకు ఆయనకు అనుమతి లేదని చెప్పడంతో స్వల్ప ఘర్షణ జరిగిందని ఓ ఖలిస్థానీ కార్యకర్త చెప్పాడు. బ్రిటన్‌లోని ఏ గురుద్వారాలోనూ భారత అధికారులకు ఆహ్వానం లేదన్నాడు. ‘యూకే, భారత్ కుమ్మక్కుతో మేం విసిగిపోయాం. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఉద్రిక్తతలు బ్రిటిష్ సిక్కులను లక్ష్యంగా చేసుకున్నాయి’ అని పేర్కొన్నాడు.