Newyork: వరదలు ముంచెత్తడంతో న్యూయార్క్ లో ఎమర్జెన్సీ.. వీడియో ఇదిగో!
- శుక్రవారం అర్ధరాత్రి కుండపోతగా కురిసిన వర్షం
- జలమయంగా మారిన వీధులు, లోతట్టు ప్రాంతాలు
- పలు ఇళ్లల్లోకి చేరిన నీరు.. గతేడాది కూడా ఇదే నెలలో వరదలు
అమెరికాలోని న్యూయార్క్ లో శుక్రవారం రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లల్లోకి చేరింది. వరద కారణంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సబ్ వేలలోకి వరద నీరు చేరడంతో అధికారులు అన్ని రైళ్లను రద్దు చేశారు. న్యూయార్క్ విమానాశ్రయంలోకి కూడా వరద చేరింది. దీంతో ఎయిర్ పోర్టును తాత్కాలికంగా మూసివేసి, విమానాలను మళ్లించారు. శనివారం కూడా వర్షం కురుస్తుండడంతో వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వర్షం, వరదలకు సంబంధించి జాతీయ వాతావరణ శాఖ న్యూయార్క్ వాసులకు హెచ్చరికలు జారీ చేసింది. కుండపోత వర్షాల నేపథ్యంలో ఇళ్లల్లోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాగా, రెండేళ్ల కిందట కూడా సెప్టెంబర్ నెలలోనే అమెరికాలో వరదలు బీభత్సం సృష్టించాయి. బ్రూక్లిన్, క్వీన్స్ రాష్ట్రాల్లో వరదల కారణంగా గతేడాది 13 మంది చనిపోయారు.