ODI WC 2023: ఇండియా కాదు.. పాకిస్థాన్ కాదు.. వరల్డ్ కప్ గెలిచేది ఈ దేశమే: గవాస్కర్
- అక్టోబర్ 5 న వన్డే ప్రపంచకప్ ప్రారంభం
- ఇంగ్లండ్ ప్రపంచకప్ ను గెలుస్తుందన్న గవాస్కర్
- బౌలింగ్ లైనప్, టాప్ ఆర్డర్ బ్యాంటింగ్ అద్భుతంగా వున్నాయని కితాబు
అక్టోబర్ 5వ తేదీన వన్డే ప్రపంచ కప్ ప్రారభం కాబోతోంది. ఈ ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యమిస్తోంది. తొలి మ్యాచ్ అహ్మదాబాద్ లో ఇంగ్లండ్ - న్యూజిలాండ్ దేశాల మధ్య జరగనుంది. ఇండియా తన తొలి మ్యాచ్ ను అక్టోబర్ 8న ఆడబోతోంది. చెన్నైలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతుంది. మరోవైపు ఈసారి వరల్డ్ కప్ ను గెలుచుకునే జట్టు ఏదో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అంచనా వేశారు. ఆయన దృష్టిలో వరల్డ్ కప్ ను లిఫ్ట్ చేసేది ఇండియా కాదు, పాకిస్థాన్ కాదు. ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంటుందని గవాస్కర్ చెప్పారు.
జోస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టులో టెర్రిఫిక్ బౌలింగ్ లైనప్ ఉందని... గేమ్ ను సమూలంగా మార్చేయగల ప్రపంచ స్థాయి ఆల్ రౌండర్లు ఉన్నారని గవాస్కర్ చెప్పారు. ఇంగ్లండ్ బ్యాటింగ్ టాప్ ఆర్డర్ బలంగా ఉందని తెలిపారు. ఇంగ్లండ్ వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ను గెలుచుకోబోతోందని జోస్యం చెప్పారు.
మరోవైపు టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ టీమిండియానే వరల్డ్ కప్ ఫేవరెట్ అని చెప్పాడు. ఆసియా కప్ తో పాటు, ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో భారత్ అద్భుతమైన ఆటతీరును కనపరిచిందని తెలిపాడు. మహమ్మద్ షమీ వంటి అగ్రశ్రేణి బౌలర్ కే టీమ్ తుది జట్టులో వరుసగా అవకాశం రావడం లేదంటే... మన జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నాడు.
ఇంకోవైపు, టీమిండియా ఈరోజు తొలి వార్మప్ మ్యాచ్ ను ఆడబోతోంది. ఇంగ్లండ్ తో ఈ మ్యాచ్ జరగబోతోంది. గువాహటిలో జరగనున్న ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది.