Asian Games: ఆసియా క్రీడల్లో భారత్ కు స్వర్ణం అందించిన బోపన్న, రుతుజా జోడీ

Bopanna and Rutuja wins Asian Games Tennis mixed doubles gold for India
  • టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లో బోపన్న, రుతుజా జోడీ విజయం
  • ఫైనల్లో చైనీస్ తైపీ జోడీని ఓడించిన భారత్ ద్వయం
  • తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న బోపన్న, రుతుజా
  • భారత్ ఖాతాలో 9వ స్వర్ణం 
చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం లభించింది. టెన్నిస్ మిక్స్ డ్ డబుల్స్ ఈవెంట్లో రోహన్ బోపన్న రుతుజా భోసాలే జోడీ ఫైనల్లో విజయకేతనం ఎగురవేసింది. చైనీస్ తైపీకి చెందిన ఎన్ షువో లియాంగ్, త్సుంగ్ హావో హువాంగ్ జోడీపై 2-6, 6-3, 10-4తో బోపన్న, రుతుజా అద్భుత విజయం సాధించారు. 

భారత జోడీ తొలి సెట్ ను కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత పోరాట పటిమతో పుంజుకుని మ్యాచ్ ను, తద్వారా పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఈ స్వర్ణంతో భారత్ పతకాల పట్టికలో ఐదోస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 9 స్వర్ణాలు, 13 రజతాలు, 13 కాంస్యాలు సహా మొత్తం 35 పతకాలు ఉన్నాయి. 

కాగా, సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా క్రీడల్లో చైనా 107 స్వర్ణాలు సహా మొత్తం 206 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Asian Games
Rohan Bopanna
Rutuja Bhosale
Gold
Mixed Doubles
Tennis

More Telugu News