Rs.2000: రూ.2000 నోట్లు మార్చుకునేందుకు గడువు పెంచిన ఆర్బీఐ... వివరాలు ఇవిగో!
- గతంలో రూ.2000 నోట్ల మార్పిడికి గడువు విధించిన కేంద్రం
- నేటితో ముగిసిన పాత గడువు
- అక్టోబరు 7 వరకు గడువు పొడిగిస్తున్నట్టు ఆర్బీఐ తాజా ప్రకటన
గతంలో తీసుకువచ్చిన రూ.2000 కరెన్సీ నోట్లను ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు, లేదా మార్కెట్లో మార్చుకునేందుకు సెప్టెంబరు 30వ తేదీని గడువుగా విధించింది.
అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆ గడువును కొన్నిరోజుల పాటు పొడిగించింది. అక్టోబరు 7వ తేదీ వరకు రూ.2000 నోట్లను మార్చుకునేందుకు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. గడువు పొడిగించిన నేపథ్యంలో, అక్టోబరు 7 వరకు రూ.2000 నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది.
ఆర్బీఐ ప్రకటనలోని ముఖ్యాంశాలు...
- అక్టోబరు 8 నుంచి రూ.2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి, మార్చుకోవడానికి ఎంతమాత్రం అనుమతించరు.
- అక్టోబరు 8 నుంచి... వ్యక్తులు కానీ, సంస్థలు కానీ 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద రూ.2000 నోట్లను మార్చుకోవచ్చు. అయితే, ఒక్కసారికి రూ.20 వేల వరకే మార్చుకునేలా పరిమితి విధించారు.
- నిర్దేశిత 19 ఆర్బీఐ కార్యాలయాల వద్ద వ్యక్తులు కానీ, సంస్థలు కానీ రూ.2000 నోట్లను తమ బ్యాంకు ఖాతాల్లోకి డిపాజిట్ చేసుకోవచ్చు.
- వ్యక్తులు కానీ, సంస్థలు కానీ తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను నిర్దేశిత ఆర్బీఐ కార్యాలయాలకు పోస్టులో పంపడం ద్వారా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు.
- ఈ లావాదేవీలన్నీ ప్రభుత్వ, ఆర్బీఐ నిబంధనలకు లోబడి జరుగుతాయి. ప్రజలు తమ ధ్రువీకరణ పత్రాలను సమర్పించి, నిర్దిష్ట విధివిధానాలను పాటించాల్సి ఉంటుంది.
- ఇక, కోర్టులు, దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, ఇతర ప్రభుత్వ వర్గాలు తమ వద్ద ఉన్న రూ.2000 నోట్లను ఎలాంటి పరిమితి లేకుండా 19 ఆర్బీఐ కేంద్రాల్లో డిపాజిట్ చేయవచ్చు.