Celebrity Cricket League: సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో రసాభాస.. అంపైర్ ‘ఫోర్’ ఇవ్వలేదంటూ నటి కన్నీటిపర్యంతం
- బంగ్లాదేశ్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో అంపైర్ నిర్ణయంతో మొదలైన వివాదం
- కలబడి కొట్టుకున్న నటీనటులు, గ్రూప్ దశలోనే టోర్నమెంట్ రద్దు
- ఆరుగురికి గాయాలు, కొందరు ఆసుపత్రి పాలు
- నెట్టింట వీడియో వైరల్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సెలబ్రిటీ క్రికెట్ లీగ్ అర్ధాంతరంగా ముగిసిపోయింది. అంపర్ నిర్ణయంపై విభేదాల కారణంగా నటీనటులు గొడవకు దిగడంతో గ్రూప్ దశలోనే టోర్నమెంట్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. ఈ గొడవలో ఏకంగా ఆరుగురు గాయపడ్డారు. వారిలో కొందరు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. నిర్మాత ముస్తాఫా కమాల్ రాజ్, దీపాంకర్ దీపోన్‌కు చెందిన టీమ్స్ మధ్య వివాదం చెలరేగింది.
కాగా, అంపైర్ నిర్ణయంపై నటి రాజ్ రిపా కన్నీటిపర్యంతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టోర్నమెంట్ నిర్వాహకులు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఆమె ఆరోపించింది. బ్యాట్స్‌మెన్ ఫోరు కొట్టినా అంపైర్ బౌండరీ ఇవ్వలేదంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు.
ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్‌ను డబ్ల్యూడబ్ల్యూఈ మ్యాచ్‌గా మార్చేశారంటూ సెటైర్లు పేలుస్తున్నారు. స్నేహపూర్వక మ్యాచ్‌లో క్రీడాకారుల మధ్య ఇంతటి ఆగ్రహావేశాలా? అంటూ మరికొందరు ఆశ్చర్యపోయారు.