KCR: నేడు మహబూబ్‌నగర్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ మళ్లీ గైర్హాజరు
- రాష్ట్రానికి మోదీ ఎప్పుడొచ్చినా దూరంగా ఉంటున్న కేసీఆర్
- శంషాబాద్‌లో మోదీకి స్వాగతం పలకనున్న మంత్రి తలసాని
- వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న ముఖ్యమంత్రి
ప్రధాని నరేంద్రమోదీపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకా దూరం పాటిస్తూనే ఉన్నారు. ప్రధాని ఎప్పుడు రాష్ట్రానికి వచ్చినా ఆయనకు స్వాగతం పలకకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ ఈసారి కూడా ప్రధాని పర్యటనకు గైర్హాజరవుతున్నారు. ఆయనకు బదులుగా మంత్రులను పురమాయిస్తున్నారు. నేటి మధ్యాహ్నం 1.30 గంటలకు మోదీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాధారణంగా సీఎం ఆయనకు స్వాగతం పలకాల్సి ఉండగా.. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి స్వాగతం పలుకుతారు. కేసీఆర్ వైరల్ ఫీవర్‌తో బాధపడుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
నిజానికి మోదీ-కేసీఆర్ మధ్య బంధం ఇటీవలి వరకు బాగానే ఉండేది. అయితే, లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరు తెరపైకి రావడం, ఆమెను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరగడంతో కేంద్రంతో కేసీఆర్ సంబంధాలు దెబ్బతిన్నట్టు ప్రచారం జరిగింది. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
మోదీ పర్యటన ఖరారైన తర్వాత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా అందరూ ప్రధానిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేటీఆర్ అయితే ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మోదీ ఓట్ల కోసం బయలుదేరిన మాయగాడని ధ్వజమెత్తారు. తల్లిని చంపి బిడ్డను వేరుచేశారంటూ అప్పట్లో తెలంగాణపై విషం కక్కారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తారా? ప్రజాగ్రహానికి గురవుతారా? అని హెచ్చరించారు.
మోదీ పర్యటన ఇలా..
* మధ్యాహ్నం 1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ
* అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మహబూబ్‌నగర్‌కు
* 2.10 గంటలకు మహబూబ్‌నగర్ హెలిప్యాడ్ వద్దకు ప్రధాని
* 2.15 నుంచి 2.50 వరకు మహబూబ్‌నగర్‌లో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు
* 3 గంటలకు బహిరంగసభ వేదిక వద్దకు
* 4 గంటల వరకు బహిరంగ సభ వద్దే ప్రధాని
* 4.10 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి హెలికాప్టర్‌లో శంషాబాద్‌కు పయనం
* 4.45 గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న మోదీ
* 4.50 గంటలకు శంషాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి