Mlc kasireddy: బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కసిరెడ్డి.. రేవంత్ తో భేటీ
- కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్సీ
- ఆదివారం ఉదయం టీపీసీసీ చీఫ్ తో భేటీ
- కల్వకుర్తి నుంచి అసెంబ్లీ బరిలోకి..?
అధికార పార్టీ బీఆర్ఎస్ కు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి షాక్ ఇచ్చారు. పార్టీ అధిష్టానం తీరుతో నిరాశ చెందిన కసిరెడ్డి.. పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆదివారం ఉదయం తన రాజీనామా లేఖను బీఆర్ఎస్ అధిష్టానానికి పంపినట్లు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ కసిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు.
కల్వకుర్తి నియోజకవర్గం టికెట్ ను ఆశించగా.. బీఆర్ఎస్ పార్టీ ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. పార్టీ టికెట్ల కేటాయింపు ప్రకటన వెలువడిన తర్వాత కసిరెడ్డి అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలోనే పార్టీ నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకున్నారని, తాజాగా ఆ నిర్ణయాన్ని అమలుచేశారని కసిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. కాగా, కల్వకుర్తి జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ కూడా కసిరెడ్డి బాటలోనే నడుస్తున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన బాలాజీ సింగ్.. కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు.