MLA Rajasingh: కేసీఆర్,కేటీఆర్‌కు దమ్ముంటే మోదీని కలిసి ప్రశ్నించాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
- రాష్ట్రానికి కావాల్సిన ప్రాజెక్టుల గురించి మోదీని కలవాలని డిమాండ్
- నేడు మహబూబ్‌నగర్‌కు వస్తున్న ప్రధాని మోదీ
- ప్రధానికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో వెలిసిన పోస్టర్లపై రాజాసింగ్ ఆగ్రహం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణకు వస్తున్నారు. మహబూబ్ నగర్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. సీఎం కేసీఆర్ ఈసారి కూడా ప్రధానికి స్వాగతం పలకడం లేదు. ఇక, మోదీ పర్యటన నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో మరోసారి పోస్టర్లు వెలిశాయి. దీనిపై గోషామహాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ప్రధాని మోదీకి ముఖం చూపించుకోలేకనే అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు వేసి ప్రజల్లో అభాసుపాలు కావొద్దని సూచించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు దమ్ముంటే మోదీని కలవాలని అన్నారు. ప్రధానిని కలసి తెలంగాణకు కావాల్సిన ప్రాజెక్టులను కేసీఆర్ అడగాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఏం నిధులు కావాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి ఎందుకు అడగటం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఎంఐఎం, బీఆర్ఎస్‌లు వెన్నుపోటు పార్టీలని విమర్శించారు.