Narendra Modi: గిరిజన వర్సిటీ జాప్యానికి కారణం తెలంగాణ ప్రభుత్వమే: ప్రధాని మోదీ
- మహబూబ్ నగర్ సభలో మోదీ ప్రసంగం
- వర్సిటీకి భూమి ఇవ్వడానికి ఐదేళ్లు జాప్యం చేశారన్న మోదీ
- తెలంగాణ ప్రభుత్వానికి గిరిజనులపై ప్రేమ లేదని విమర్శలు
- తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ వేరే వాళ్ల చేతుల్లో ఉందని వ్యంగ్యం
ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు సభలో తెలంగాణ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.
ప్రభుత్వం ఆసక్తి చూపించి ఉంటే గిరిజన వర్సిటీ ఎప్పుడో ఏర్పాటయ్యేదని వెల్లడించారు. యూనిర్సిటీకి భూమి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు జాప్యం చేసిందని మోదీ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి గిరిజనులపై ప్రేమ లేదని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ కారు స్టీరింగ్ వేరే వాళ్ల చేతుల్లో ఉందని మోదీ విమర్శించారు. స్టీరింగ్ ఎవరు తిప్పుతున్నారో మీకు తెలుసు కదా అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని రెండు కుటుంబాలు నడిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. కమీషన్, కరప్షన్... ఆ రెండు పార్టీల విధానం అని పేర్కొన్నారు. పార్టీ ఆఫ్ ద ఫ్యామిలీ, బై ది ఫ్యామిలీ, ఫర్ ది ఫ్యామిలీ అనేది వాళ్ల నినాదం అని మోదీ విమర్శించారు.
కేసీఆర్ కు రాష్ట్ర అభివృద్ధి కంటే కుటుంబ అభివృద్ధే ముఖ్యమని అన్నారు. అవినీతి అంతం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, తప్పుడు వాగ్దానాలు, తప్పుడు హామీలు ఇచ్చే ప్రభుత్వం వద్దు అని పిలుపునిచ్చారు.
ఇవాళ తమ సభకు వచ్చిన జనాల ప్రేమాభిమానాలు అద్భుతం అని, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్లకు ఇక నిద్ర పట్టదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని, ఈ రెండు పార్టీలకు గురువు ఎంఐఎం అని అభివర్ణించారు.