Avinash Sable: అవినాశ్ పరుగు బంగారం... ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం

Avinash Mukund Sable won 3000m Steeplechase gold in Asian Games
  • చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ఆసియా క్రీడలు
  • కొనసాగుతున్న భారత్ పసిడి జోరు
  • 3000 మీటర్ల పురుషుల స్టీపుల్ ఛేజ్ అంశంలో అవినాశ్ సేబుల్ కు స్వర్ణం
  • ఆసియా క్రీడల రికార్డు స్థాపించిన భారత అథ్లెట్
ఆసియా క్రీడల్లో భారత్ పసిడి జోరు కొనసాగుతోంది. చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ అవినాశ్ కుమార్ సేబుల్ 3000 మీటర్ల పురుషుల స్టీపుల్ ఛేజ్ అంశంలో స్వర్ణం సాధించాడు. ఆసియా క్రీడల పురుషుల అథ్లెటిక్స్ విభాగంలో  భారత్ కు ఇదే తొలి స్వర్ణం. ఆ ఘనత అవినాశ్ కు దక్కింది. 

2010 ఆసియా క్రీడల్లో సుధా సింగ్ మహిళల విభాగంలో 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ లో స్వర్ణం నెగ్గింది. కాగా, ఇవాళ అవినాశ్ సేబుల్ 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ ను 8:19:60 నిమిషాల్లో పూర్తి చేసి ఆసియా క్రీడల రికార్డు నమోదు చేశాడు.

అటు, పురుషుల షాట్ పుట్ ఈవెంట్ లోనూ భారత్ పసిడి పతకం కొల్లగొట్టింది. గత ఆసియా క్రీడల విజేత తేజిందర్ పాల్ సింగ్ తూర్ ఈసారి కూడా స్వర్ణం చేజిక్కించుకోవడం విశేషం. షాట్ పుట్ ను 20.36 మీటర్ల దూరం విసిరిన తేజిందర్ పాల్ భారత్ ఖాతాలో మరో బంగారు పతకాన్ని చేర్చాడు. ఈ రెండు పసిడి పతకాలతో భారత్ ఆసియా క్రీడల పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. 

ప్రస్తుతం భారత్ ఖాతాలో 13 స్వర్ణాలు, 21 రజతాలు, 19 కాంస్యాలు సహా మొత్తం 53 పతకాలు ఉన్నాయి. ఈ జాబితాలో ఆతిథ్య చైనా 133 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉంది. చైనా ఖాతాలో మొత్తం 244 పతకాలు ఉన్నాయి. చైనా తర్వాత స్థానంలో కొరియా, జపాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి.
Avinash Sable
Gold
3000m
Steeplechase
Asian Games
Hangzhou
India
China

More Telugu News