Telangana: ఆ ఎమ్మెల్యే నా కాళ్లు పట్టుకున్నారు.. అందుకే చందాలు వేసుకుని గెలిపించామన్న పాలకుర్తి జెడ్పీటీసీ సంధ్యారాణి

Palakurti ZPTC Kandula SandhyaRani Resigned To BRS Party

  • ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై సంచలన ఆరోపణలు
  • గెలిచాక బూడిద, ఇసుక, ఉద్యోగాలలో కోట్లు దండుకున్నారని విమర్శ
  • అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ కు రాజీనామా
  • వచ్చే ఎన్నికల్లో రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని వెల్లడి

రామగుండం నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరఫున అసెంబ్లీ టికెట్ ఆశించిన సంధ్యారాణికి నిరాశే ఎదురైంది. ఈసారి కూడా సిట్టింగ్ లకే టికెట్ ఇస్తున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించడంతో సంధ్యారాణి అసంతృప్తికి లోనయ్యారు. పార్టీ టికెట్ కోసం చివరి వరకూ ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో బీఆర్ఎస్ కు తాజాగా గుడ్ బై చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడతానని ఈ సందర్భంగా సంధ్యారాణి స్పష్టం చేశారు. ‘రామగుండం నియోజకవర్గ ప్రజలను కొంగు చాపి అడుగుతున్నా.. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి’ అంటూ కన్నీళ్లతో సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై సంధ్యారాణి సంచలన ఆరోపణలు చేశారు. గత ఎన్నికలపుడు చందర్ తన కాళ్లపైన పడ్డారని, అందుకే తామంతా చందాలు వేసుకుని ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేశామని వివరించారు. ఊరూరా తిరిగి ప్రచారం చేసి చందర్ ను గెలిపించుకున్నామని పేర్కొన్నారు. అయితే, ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చందర్ ఇవన్నీ మరిచిపోయారని ఆరోపించారు. ఆర్‌ఎఫ్‌సీఎల్ బూడిద, ఇసుక, ఉద్యోగాలను అమ్ముకుని చందర్ కోట్లు దండుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు. గడిచిన ఇరవై ఏళ్లుగా తనను అవమానిస్తూనే ఉన్నారని సంధ్యారాణి కన్నీటిపర్యంతమయ్యారు.

  • Loading...

More Telugu News