Pawan Kalyan: జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండండి... రేపు పెడనలో ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత: పవన్ కల్యాణ్
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ వారాహి విజయ యాత్ర
- పెడన నియోజకవర్గంలో బహిరంగ సభ
- వైసీపీ కిరాయి గూండాలు దాడి చేస్తారన్న సమాచారం ఉందన్న పవన్
- 'జగన్.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు' అంటూ వార్నింగ్
ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ మచిలీపట్నంలో పవన్ కల్యాణ్ జనవాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అధికార వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రేపు పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నామని, కానీ రేపటి సభలో దాడులు చేయడానికి కొంతమంది వైసీపీ కిరాయి గూండాలు ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉందని వెల్లడించారు. సుమారు రెండు మూడు వేలమంది రౌడీ మూకలు వచ్చే అవకాశం ఉందని అన్నారు.
దయచేసి జనసైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జనసేన, టీడీపీ పొత్తు విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పులివెందుల రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని పవన్ స్పష్టం చేశారు.
"జగన్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు... మాపై రేపు పెడన సభలో కత్తులు, రాళ్లతో దాడులు చేయించాలని చూస్తున్నావ్... ఏదైనా జరిగితే బాధ్యత నీదే. రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీ, అధికారులకు, కలెక్టర్లకు చెబుతున్నాను... శాంతిభద్రతలు కాపాడాల్సిన మీరు వైసీపీ నాయకులకు వత్తాసు పలకడం సరికాదు. గూండాలు వస్తే కచ్చితంగా ఎదుర్కొంటాం. అమలాపురం నుంచి అడుగడుగునా వారాహి విజయ యాత్రను అడ్డుకోవడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. రేపు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. రేపు పెడన సభలో వైసీపీ కిరాయి రౌడీలు దాడులకు ప్రయత్నిస్తే... జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు ప్రతిదాడులకు దిగొద్దు... వారిని అడ్డుకుని పోలీసులకు అప్పగించండి" అని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.