Parul Chaudhary: ఆసియా క్రీడల 5000 మీటర్ల పరుగులో భారత్ కు స్వర్ణం అందించిన పారుల్ చౌదరి
- చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో ఆసియా క్రీడలు
- భారత్ పసిడి జోరు
- మహిళల 5 వేల మీటర్ల పరుగులో పారుల్ అద్భుత ప్రదర్శన
- భారత్ ఖాతాలో 14వ స్వర్ణం
ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల హవా కొనసాగుతోంది. భారత లాంగ్ డిస్టెన్స్ రన్నర్ పారుల్ చౌదరి 5000 మీటర్ల పరుగులో భారత్ కు స్వర్ణం అందించింది. 28 ఏళ్ల పారుల్ చౌదరి 15:14:75 నిమిషాల టైమింగ్ తో రేసులో అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ కు చెందిన రిరికా హిరోనకా రజతం, కజకిస్థాన్ కు చెందిన కరోలిన్ కిప్కిరూయ్ కాంస్యం దక్కించుకున్నారు.
ఈ రేసులో పసిడి కాంతులు విరజిమ్మిన పారుల్ చౌదరి... 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్ అంశంలో ఇప్పటికే రజతం సాధించింది. ఇవాళ్టి 5 వేల మీటర్ల రేసులో అద్భుత ప్రదర్శన కనబర్చిన పారుల్ రేసులో చాలా వరకు వెనుక ఉండిపోయింది. అయితే, ఒక్కసారిగా పుంజుకున్న ఆమె... ఫినిషింగ్ లైన్ వరకు అదే ఊపు కొనసాగించింది. జపాన్ అథ్లెట్ హిరోనకాదే స్వర్ణం అని అందరూ భావించినా, అనూహ్యరీతిలో ఆమెను అధిగమించిన పారుల్ రేసులో విజేతగా నిలిచింది.
ఈ స్వర్ణంతో భారత్ ఖాతాలోని బంగారు పతకాల సంఖ్య 14కి పెరిగింది. ఓవరాల్ గా 68 పతకాలతో భారత్ ఈ ఆసియా క్రీడల్లో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఆతిథ్య చైనా, జపాన్, దక్షిణ కొరియా వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.