Nara Lokesh: ఫైబర్‌గ్రిడ్ కేసులో లోకేశ్ ఇప్పటి వరకు నిందితుడు కాదు.. కోర్టుకు తెలిపిన సీఐడీ
- ఈ కేసులో ఆయన ఇప్పటి వరకు నిందితుల జాబితాలో లేరన్న ఏజీ శ్రీరామ్
- 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు తెలిపిన ఏజీ
- ఏజీ వ్యాఖ్యలపై అనుమానం వ్యక్తం చేసిన లోకేశ్ తరపు న్యాయవాది
- 41ఏ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసిన హైకోర్టు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైబర్‌గ్రిడ్ కేసులో ఇప్పటి వరకు నిందితుడిగా లేరని హైకోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ ఆయనను కనుక నిందితుల జాబితాలో చేర్చాలనుకుంటే నిబంధనల ప్రకారం సెక్షన్ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారిస్తామని సీఐడీ తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టుకు తెలిపారు. దీంతో 41ఏ నిబంధనల మేరకు నడుచుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ కే సురేశ్‌రెడ్డి సీఐడీని ఆదేశించారు. ఫైబర్‌గ్రిడ్ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ లోకేశ్ నిన్న హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన విచారణలో సీఐడీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
విచారణలో లోకేశ్ తరపు న్యాయవాది గురుకృష్ణకుమార్ తన వాదనలు వినిపిస్తూ 41ఏ పేరుతో లోకేశ్‌ను పిలిచి నిబంధనలకు కట్టుబడలేదన్న సాకుతో అరెస్టు చేసే ప్రమాదం ఉందని కోర్టుకు తెలిపారు. 41ఏ(3)(4) నిబంధనలను ఒకేసారి సూచిస్తూ నోటీసు ఇస్తున్నారని, ఆ తర్వాత అందులోని నిబంధనలకు కట్టుబడలేదన్న సాకుతో అక్రమంగా అరెస్టు చేస్తున్నారని వాదించారు.
2021లో నమోదైన ఫైబర్‌గ్రిడ్ కేసులో ఇప్పటివరకు 94 మంది సాక్షులను సీఐడీ విచారించిందని, వారిలో ఒక్కరు కూడా పిటిషనర్ పేరు చెప్పలేదని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయ కారణాలతో లోకేశ్ పేరును లాగుతున్నారని వివరించారు. కాబట్టి లోకేశ్ అరెస్టు విషయంలో తొందరపాటు చర్యలను నివారించాలని హైకోర్టును కోరారు. స్పందించిన ఏజీ శ్రీరామ్ 41ఏకు కట్టుబడి ఉంటామని కోర్టుకు తెలపడంతో ఈ వ్యాజ్యాన్ని కోర్టు మూసివేసింది.