Telugudesam: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ 22వ రోజు టీడీపీ రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు

TDP protest 22nd day against chandrababu arrest

  • లోకేశ్‌నూ అరెస్ట్ చేయాలని చూస్తున్నారని టీడీపీ ఆగ్రహం
  • వైఎస్ జగన్ జిత్తుల మారి నక్క అని టీడీపీ విమర్శలు
  • టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర చేస్తున్నారని ఆరోపణ
  • ప్రజాక్షేత్రంలో జగన్‌కు భంగపాటు తప్పదన్న టీడీపీ నేతలు

చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టి సీఎం జగన్‌ రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 22వ రోజు టీడీపీ నేతలు రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ... తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేలకోట్లు దిగమింగిన జగన్ 16 నెలల పాటు జైల్లో చిప్పకూడు తిన్నారన్నారు. అక్రమంగా వేలకోట్లు తినేసిన తనలాగే అందరూ జైలు జీవితం గడపాలనే కుట్రతోనే చంద్రబాబును అక్రమ కేసులో ఇరికించి జైల్లో పెట్టించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వ్యవస్థలను సైతం జగన్ దుర్వినియోగం చేస్తున్నాడని, కొందరు అధికారులు జగన్‌కు తొత్తులుగా మారి వ్యవహరించడాన్ని తప్పుబట్టారు.

నారా లోకేశ్‌ని కూడా అరెస్టు చేయాలని ప్రయత్నించడం ద్వారా తెలుగుదేశం పార్టీపై కక్ష సాధింపు చర్యలకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వారి ఆటలు సాగవని హెచ్చరించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించి అధికారంలోకి రావడానికి జగన్ కుయుక్తులు పన్నుతున్నారన్నారు.

తెలుగుదేశం, జనసేన, సీపీఐ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని VRC సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం నుండి గాంధీ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీకి అనుమతి లేదంటూ కావలి పార్టీ కార్యాలయం వద్ద ఇంఛార్జి మాలేపాటి సుబ్బానాయుడుని నిర్బంధించారు. శాంతియుత ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు, ర్యాలీ చేసి తీరుతామని టీడీపీ, జనసేన, సీపీఐ నేతలు సవాళ్లు విసురుకోవడంతో నెల్లూరు పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అనుమతి ఎందుకు నిరాకరిస్తున్నారో సమాధానం చెప్పాలంటూ జిల్లా అధ్యక్షుడు అజీజ్ లేఖ రాశారు. నెల్లూరు వీఆర్సీ కూడలిలో టీడీపీ చేపట్టిన శాంతియుత ర్యాలీలో పాల్గొనడానికి వీల్లేదంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేయగా తప్పించుకుని ర్యాలీలో పాల్గొన్నారు.

ఆదోనిలో ఇంఛార్జి మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో రోడ్డుపై అర్థనగ్నంగా నిరసన తెలిపారు. మంత్రాలయంలో నియోజకవర్గం బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కళ్ళకు నల్ల రిబ్బన్ కట్టుకొని నిరసన తెలిపారు.

పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కె.ఈ.శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు స్తంబాల కూడలిలో నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం మోకాళ్లపై నిల్చొని అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలియజేశారు. రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలంలో కురుబ కులస్తుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పార్లమెంట్ అధ్యక్షులు బి.కె.పార్థసారధి, రాప్తాడు ఇంఛార్జి పరిటాల సునీత, ధర్మవరం ఇంఛార్జి పరిటాల శ్రీరాం, కురుబ సాధికార సమితి కన్వీనర్ గంగలకుంట రమణ, శివబాల పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా ఆటోనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి పొట్లూరి దర్శిత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 2వ రోజుకు చేరుకుంది. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలియజేశారు. మడకశిర నియోజకవర్గ ఇంచార్జ్ గుండుమల తిప్పేస్వామి ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతిపత్రం అందించి దున్నపోతులా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి రావాలని కోరారు. ఈ తుగ్లక్ పాలన మాకొద్దు బాబోయ్ అంటూ చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా రావులపాలెంలో తుగ్లక్ వేషధారణ వున్న వ్యక్తితో కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు నిరసన తెలియజేశారు. కడప నగరం రెడ్డి కాలనీలో మేము సైతం బాబుతో అంటూ దివ్యాంగులు దీక్షలో పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే, ఇంచార్జీ బి.కె పార్థసారథి ఆధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గంలో నిరవధికంగా 21 రోజులు సామూహిక నిరాహార దీక్ష అనంతరం గొల్లపల్లి రిజర్వాయిర్ లో జల దీక్ష కార్యక్రమం చేపట్టారు. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమల మండలంలో ఎం. నాగులపల్లి గ్రామంలో అక్రమ అరెస్టు భాగంలో చంద్రబాబు త్వరగా బయటికి రావాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాలపురం నియోజకవర్గ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకట రాజు ఆధ్వర్యంలో ఆ గ్రామ మహిళలందరూ కలిసి హనుమాన్ చాలీసా, రామ నామం జపిస్తూ దీక్ష చేశారు.

ఈ నిరసన దీక్షలలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు, కిమిడి కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, రెడ్డెప్పగారి శ్రీనివాసులు రెడ్డి, కొల్లు రవీంద్ర, గుమ్మడి సంధ్యారాణి, పార్లమెంట్ అధ్యక్షులు కూన రవికుమార్, బుద్దా నాగజగధీశ్వరరావు, నెట్టెం రఘురాం, తెనాలి శ్రావణ్ కుమార్, జి.వి ఆంజనేయులు, ఏలూరి సాంబశివరావు, నూకసాని బాలాజీ, బి.కె పార్థసారథి, మల్లెల లింగారెడ్డి, గొల్లా నరసింహాయాదవ్, పులివర్తి నాని, ఎమ్మెల్యేలు , నియోజకవర్గ ఇంఛార్జులు, రాష్ట్ర, మండల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

       


                


                        

  • Loading...

More Telugu News