Censor Board: విశాల్ ను లంచం అడిగిన వాళ్లకు సెన్సార్ బోర్డుకు సంబంధంలేదట..!
- హీరో ఆరోపణలపై కేంద్ర సెన్సార్ బోర్డు వివరణ
- ఆయన వద్ద డబ్బులు తీసుకున్నది దళారులేనని వెల్లడి
- పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరణ
సెన్సార్ బోర్డులో అవినీతి పేరుకుపోయిందంటూ హీరో విశాల్ చేసిన ఆరోపణలు, చూపించిన ఆధారాలపై కేంద్ర సెన్సార్ బోర్డు అత్యవసరంగా సమావేశమైన విషయం తెలిసిందే! బోర్డు సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిపిన సభ్యులు.. మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. హీరో విశాల్ నుంచి డబ్బులు డిమాండ్ చేసి, వసూలు చేసిన వారికి సెన్సార్ బోర్డుతో సంబంధం లేదని స్పష్టం చేశారు. వారు దళారులేనని, బోర్డులో సభ్యులు కారని వివరణ ఇచ్చారు. సెన్సార్ సర్టిఫికెట్ కోసం లంచం డిమాండ్ చేశారంటూ విశాల్ చేసిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇకపై సినిమాల సెన్సార్ ప్రక్రియను ఆన్ లైన్ లోనే పూర్తి చేయాలని బోర్డు నిర్ణయించినట్లు వెల్లడించారు.
డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తమ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ పొందేందుకు అన్ని నియమనిబంధనలను పాటిస్తూ ఆన్ లైన్ లోనే దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర సెన్సార్ బోర్డు సూచించింది. అదే సమయంలో త్వరగా సర్టిఫికెట్ ఇవ్వాలంటూ బోర్డు సభ్యులపై ఒత్తిడి తీసుకురావొద్దని కోరింది. ఏటా బోర్డు ముందుకు 18 వేలకు పైగా సినిమాలు సెన్సార్ సర్టిఫికెట్ కోసం వస్తాయని తెలిపింది. వాటిని చూసి సెన్సార్ చేసేందుకు సమయం పడుతుందని గుర్తుచేస్తూ.. సర్టిఫికెట్ త్వరగా ఇవ్వాలంటూ సభ్యులను కోరవద్దని పేర్కొంది.