KTR: రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారు.. కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లు ఆ పార్టీలోకి జంప్ అవుతారు: కేటీఆర్
- అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తోందని విమర్శ
- మోసాన్ని మోసంతోనే జయించి ఓటు మాత్రం బీఆర్ఎస్కు వేయాలని పిలుపు
- కాంగ్రెస్ కడుపులో గుద్ది నోట్లో పిప్పరమెంట్ పెట్టే రకమని ఎద్దేవా
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసిపోయారని, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు బీజేపీలోకి జంప్ అవుతారని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఆయన డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్ ఇప్పుడు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందన్నారు. హామీలతో ప్రజలను ప్రలోభపెట్టాలని చూస్తోందన్నారు. మోసాన్ని మోసంతోనే జయించి ఓటు మాత్రం బీఆర్ఎస్కు వేయాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీ వారికి అదానీ నుంచి చాలా డబ్బులు వస్తున్నాయట, కాబట్టి కాంగ్రెస్, బీజేపీలను దబాయించి డబ్బులు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. రైతు బంధు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు వస్తేనే బీఆర్ఎస్కు ఓటు వేయాలన్నారు. గత తొమ్మిదేళ్లలో ఎన్నో పనులు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు కడుపులో గుద్ది, నోట్లో పిప్పరమెంట్ పెట్టే రకం అన్నారు. బీజేపీ నీళ్ల వాటాను తేల్చమంటే తేల్చడం లేదన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రాజెక్టులపై కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నారన్నారు.