World Cup: వరల్డ్ కప్: భారీ స్కోరు ఖాయమనుకున్న ఇంగ్లండ్ ను భలే కట్టడి చేసిన కివీస్ బౌలర్లు
- భారత్ లో నేటి నుంచి వరల్డ్ కప్
- ప్రారంభ మ్యాచ్ లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కివీస్
- భారత్ పరిస్థితులను ఉపయోగించుకుని రాణించిన కివీస్ బౌలర్లు
ఫార్మాట్ ఏదైనా తొలి బంతి నుంచి బాదడమే ఇంగ్లండ్ జట్టు ప్రధాన సిద్ధాంతం. కానీ, ఇవాళ్టి వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ లో వారి ఎత్తుగడ పారలేదు. ఓ దశలో వికెట్లు పడినా మెరుగైన రన్ రేట్ తో ఉన్న ఇంగ్లండ్ 300 పరుగుల పైచిలుకు భారీ స్కోరు సాధించడం ఖాయమనిపించింది.
కానీ అద్భుతంగా పుంజుకున్న న్యూజిలాండ్ బౌలర్లు ఇంగ్లండ్ కు సమర్థవంతంగా కళ్లెం వేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 3 వికెట్లు తీయగా, మిచెల్ శాంట్నర్ 2 వికెట్లు తీశారు.
ముఖ్యంగా పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ రెండు కీలక వికెట్లతో ఇంగ్లండ్ ను దెబ్బకొట్టాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కు మూలస్తంభంలా నిలిచిన జో రూట్ ను పెవిలియన్ కు పంపాడు. అంతకుముందు, ప్రమాదకర మొయిన్ అలీని అవుట్ చేసి ఇంగ్లండ్ భారీ స్కోరు అవకాశాలను ప్రభావితం చేశాడు. ఇక, ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ 1, రచిన్ రవీంద్ర 1 వికెట్ తీశారు.
ఇంగ్లండ్ జట్టులో స్టార్ ఆటగాడు జో రూట్ చేసిన 77 పరుగులే అత్యధికం. కెప్టెన్ జోస్ బట్లర్ 43 పరుగులు సాధించాడు. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 33, యువ ఆటగాడు హ్యారీ బ్రూక్ 25, లియామ్ లివింగ్ స్టోన్ 20 పరుగులు చేశాడు. ఓపెనర్ డేవిడ్ మలాన్ (14), మొయిన్ అలీ (11), శామ్ కరన్ (14) విఫలమయ్యారు.
చివరి వరుస బ్యాట్స్ మన్ తలో చేయి వేయడంతో ఇంగ్లండ్ స్కోరు 250 మార్కు దాటింది. అదిల్ రషీద్ 15, మార్క్ ఉడ్ 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.