Pawan Kalyan: మేం ఎన్డీయేలో ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి?: ముదినేపల్లిలో పవన్ కల్యాణ్
- ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
- తాము ఎవరికీ భయపడబోమని స్పష్టీకరణ
- ఇవాళ టీడీపీకి కూడా మేమున్నాం అనే బలాన్ని అందించామని వెల్లడి
- పథకాలకు డబ్బులిచ్చుకుంటూ కూడా మేమంటే ఎందుకు భయపడుతున్నారన్న జనసేనాని
ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర కొనసాగుతోంది. ఈ సాయంత్రం కైకలూరు నియోజకవర్గంలోని ముదినేపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. 2019లో తమకు ఓట్లు వేసిన కైకలూరు ప్రజలను గుండెల్లో పెట్టుకున్నానంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడికి వస్తుంటే ప్రజలు దారిపొడవునా స్వాగతం పలికారని, వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.
ఈ క్రమంలో ఆయన ఏపీ అధికార పక్షం వైసీపీపైనా, సీఎం జగన్ పైనా ధ్వజమెత్తారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీల బలం ఉన్న పార్టీ వైసీపీ... ఏ పదవి లేని, కేవలం జనసైనికుల బలం ఉన్న పార్టీ జనసేన పార్టీ అని పవన్ ఉద్ఘాటించారు. తాము ఎవరికీ భయపడబోమని, ఇవాళ టీడీపీ వాళ్లకు కూడా మేమున్నాం అనే బలాన్ని అందించామని తెలిపారు.
"ఎన్డీయే కూటమి నుంచి మేం బయటికి వచ్చేశాం అని విమర్శిస్తున్నారు. మేం ఎన్డీయేలో ఉంటే నీకేంటి, లేకపోతే నీకేంటి? పథకాలకు డబ్బులు ఇస్తూ కూడా మాకు భయపడుతున్నారంటే దానర్థం ఓడిపోతున్నారనే! మీరు ఇంకా భయపడాలి" అంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి బయటికి రావాలి అనుకుంటే ఆ విషయం తానే చెబుతానని వెల్లడించారు. మేం బయటికి వచ్చేశామని మీరు చెబితే ఎలా? అంటూ మండిపడ్డారు. తాము ఎన్డీయేలోనే ఉన్నామని పవన్ సభా ముఖంగా స్పష్టం చేశారు. తనకు ప్రధాని మోదీ, జేపీ నడ్డా, అమిత్ షా అంటే అమితమైన గౌరవం ఉందని తెలిపారు. అందరం కలిసి వెళతామనే అనుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.
"కొందరు వైసీపీ వర్గీయులు బెదిరిస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత నీ అంతు చూస్తాం అంటున్నారు. నేను మీ ముఖ్యమంత్రి జగన్ తండ్రినే ఎదుర్కొన్నాను. ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయినప్పుడు ఎక్కడికీ పారిపోకుండా హైదరాబాదులోనే ఉన్నాను. ధైర్యంగా మళ్లీ పార్టీ పెట్టాను. పవన్ కల్యాణ్ మీ ఉడుత ఊపులకు భయపడేవాడు కాదు.
2014లో వైసీపీ ఓడిపోయింది... ఆ సమయంలో మా పార్టీ ఆఫీసు వద్దకు వైసీపీ రౌడీలు వచ్చారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ ఓడిపోయుంటే నా పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోండి. 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఉంటుందో, ఉండదో మీరే తేల్చుకోండి. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే" అంటూ పవన్ ధీమా వ్యక్తం చేశారు.