Pawan Kalyan: జగన్ మళ్లీ వస్తే మీ ఆస్తి పేపర్లు కూడా మీ దగ్గర ఉంచడు: పవన్ కల్యాణ్
- వారాహి యాత్రలో జగన్‌పై విరుచుకుపడ్డ జనసేన అధినేత
- విద్యార్థులకు సర్టిఫికేట్లు కూడా ఏపీ ప్రభుత్వం ఇవ్వలేకపోతోందని ఆగ్రహం
- భవిష్యత్తులో ప్రజల ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వం వద్దకు చేరుతాయని హెచ్చరిక
- ప్రజలను గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతుందని వెల్లడి
వారాహి విజయయాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు ఇంటర్ సర్టిఫికేట్లు ఇవ్వలేకపోతోందని, కొత్త వాహనం రిజిస్టర్ చేసుకున్న వారికి ఆర్‌సీ కూడా ఇవ్వలేకపోతోందని దుయ్యబట్టారు. భవిష్యత్తులో ప్రజల వద్ద వారి ఆస్తుల దస్తావేజులు కూడా ఉండనీయరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ఇదే జరుగుతుందని వ్యాఖ్యానించారు.
ప్రజల ఆస్తులు వైసీపీ, జగన్ పాలయ్యే పరిస్థితులు వస్తాయని హెచ్చరించారు. ఆడపిల్లలకు పసుపు కుంకుమల కింద ఇచ్చే ఆస్తుల దస్తావేజులు ప్రభుత్వపరం అవుతాయని చెప్పుకొచ్చారు. ప్రజల ఆస్తులతో ప్రభుత్వానికి సంబంధం ఏంటని నిలదీశారు. అంచెలంచెలుగా ప్రజల జీవితాలను తమ గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోందని హెచ్చరించారు.