India: భారత హాకీ జట్టు డబుల్ ధమాకా... ఆసియా క్రీడల స్వర్ణంతో పాటు ఒలింపిక్స్ బెర్తు ఖరారు

Indian hockey team wins Asian Games gold and confirmed Paris Olympics berth
  • చైనాలోని హాంగ్ ఝౌలో ఆసియా క్రీడలు
  • నేడు పురుషుల హాకీ ఈవెంట్ లో ఫైనల్
  • జపాన్ ను 5-1తో మట్టికరిపించిన భారత్
ఆసియా క్రీడల హాకీలో భారత పురుషుల జట్టు స్వర్ణం చేజిక్కించుకుంది. చైనాలోని హాంగ్ ఝౌలో ఇవాళ జరిగిన ఫైనల్లో భారత్ 5-1తో జపాన్ ను ఓడించి ఆసియా క్రీడల హాకీ విజేతగా నిలిచింది. అంతేకాదు, ఈ ఘనవిజయంతో పారిస్ ఒలింపిక్స్ బెర్తును కూడా భారత్ ఖరారు చేసుకుంది. 

నేడు జపాన్ తో ఫైనల్లో మ్యాచ్ ఆసాంతం భారత్ ఆధిపత్యమే కొనసాగింది. భారత ఆటగాళ్లు టర్ఫ్ పై చిరుతల్లా కదలగా, జపాన్ జట్టు సరైన వ్యూహం లేకుండా ఆడి చిత్తయింది. భారత ఫార్వర్డ్ లు పదే పదే జపాన్ గోల్ పోస్ట్ పై దాడులు చేస్తూ ఒత్తిడి పెంచారు. 

ఈ మ్యాచ్ లో భారత్ తరఫున హర్మన్ ప్రీత్ సింగ్ 32, 59వ నిమిషాల్లో రెండు గోల్స్ కొట్టడం విశేషం. ఈ మ్యాచ్ లో తొలి గోలును 25వ నిమిషంలో మన్ ప్రీత్ సింగ్ సాధించాడు. 36వ నిమిషంలో అమిత్ రోహిదాస్, 48వ నిమిషంలో అభిషేక్ గోల్స్ సాధించారు. జపాన్ తరఫున 51వ నిమిషంలో సెరెన్ తనాకా ఏకైక గోల్ నమోదు చేశాడు. 

ఆసియా క్రీడల పురుషుల హాకీలో భారత్ స్వర్ణం గెలవడం ఇది నాలుగోసారి. 1966, 1998, 2014 ఆసియా క్రీడల్లోనూ భారత్ హాకీ ఈవెంట్ లో విజేతగా నిలిచింది. ప్రస్తుతం చైనాలోని హాంగ్ ఝౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత స్వర్ణాల సంఖ్య 22కి పెరిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 95 పతకాలు ఉన్నాయి. వాటిలో 34 రజతాలు, 39 కాంస్యాలు కూడా ఉన్నాయి. 

హాంగ్ ఝౌ ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఆతిథ్య చైనా మొత్తం 352 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. చైనా ఖాతాలో 187 స్వర్ణాలు, 104 రజతాలు, 61 కాంస్యాలు ఉన్నాయి. జపాన్ (45 స్వర్ణాలు), దక్షిణ కొరియా (36 స్వర్ణాలు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
India
Gold
Hockey
Asian Games
Paris Olympics

More Telugu News