Perni Nani: జగన్‌కు దమ్ముంది.. అందుకే ఏ పార్టీతోనూ పొత్తుతో వెళ్లడం లేదు: పేర్ని నాని
- చంద్రబాబు కుటుంబం సెంటిమెంట్ ప్లే చేసే ప్రయత్నం చేసిందని విమర్శ
- చంద్రబాబు అరెస్టయ్యాక లోకేశ్ ఎక్కడ ఉన్నాడని ప్రశ్న
- వీరప్పన్ కూడా దొరికిన తర్వాత టీడీపీ నేతలానే మాట్లాడారని ఎద్దేవా
- వైఎస్సార్‌పై పవన్ కల్యాణ్ ఏం పోరాటం చేశారో చెప్పాలన్న పేర్ని నాని
- పవన్, చంద్రబాబు ఏపీకి పట్టిన మహమ్మారి అని ఆగ్రహం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు కుటుంబం అంతా కలిసి సెంటిమెంట్ ప్లే చేసేందుకు ప్రయత్నించిందన్నారు. ఉత్తర కుమారుడు లోకేశ్ ఏదోదో మాట్లాడుతున్నారని, కక్షతో తన తండ్రిని అరెస్ట్ చేసినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు అరెస్ట్ అయ్యాక లోకేశ్ ఎక్కడ ఉన్నారు? న్యాయవాదులంతా విజయవాడ రోడ్లపై తిరుగుతుంటే లోకేశ్ ఎక్కడ ఉన్నాడు? ఎవరిని మేనేజ్ చేద్దామని ఢిల్లీకి వెళ్లారు? మేనేజ్ చేయడం వారికి తెలిసిన విద్యే అన్నారు.
ఇరవై ఐదు రోజులుగా ఢిల్లీలో ఎందుకు ఉన్నారు? ఎవరి కాళ్లు, చేతులు పట్టుకోవడానికి? అని నిలదీశారు. స్కిల్ స్కాంలో రూ.27 కోట్లు మీ పార్టీ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ వేషాలు ఇక్కడ వద్దని, సీమెన్స్ ఇస్తామన్న డబ్బులు ఎక్కడ? అని ప్రశ్నించారు. దొరకనంత మాత్రాన దొంగ కాకుండా పోతారా? అన్నారు. చంద్రబాబు ఇప్పుడు అడ్డంగా దొరికారని, కానీ అప్పుడు వీరప్పన్ చెప్పిన కబుర్లు నారా లోకేశ్ చెబుతున్నారని విమర్శించారు.
దొరకనంత వరకు అందరూ దొంగలేనని, వీరప్పన్ తాను దొరికిన తర్వాత మీలాగే తాను దొంగను కాదని చెప్పారని చురక అంటించారు. తానేదో అడవికి న్యాయం చేస్తున్నట్లు వీరప్పన్ చెప్పుకున్నాడన్నారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాల తర్వాత దొరికారన్నారు. మీరు అంత నిజాయతీపరులైతే మీ ఆస్తులపై కోర్టు మానిటర్ విచారణకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్‌పై విమర్శలు
పవన్ ఐదు రోజుల పాటు కృష్ణాలో ఆటవిడుపు యాత్ర చేశారని, ఆయన మాటలు జనసేన కార్యకర్తలకు కూడా నచ్చడం లేదన్నారు. జగన్‌కు దమ్ముందని, అందుకే ఏ పార్టీతోనూ పొత్తుతో వెళ్లడం లేదన్నారు. పవన్ లా జగన్ రోజుకో పార్టీ మార్చరన్నారు. అవనిగడ్డలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు చెప్పిన జనసేనాని, ముదినేపల్లిలో తిరిగి అందులోనే కొనసాగుతున్నట్లు చెప్పారన్నారు. వైఎస్సార్ పై పవన్ కల్యాణ్ ఎప్పుడు పోరాటం చేశారో చెప్పాలన్నారు. తనకు బీజేపీ కంటే చంద్రబాబు ముఖ్యమని పవన్ తేల్చేశారన్నారు. జగన్‌పై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదన్నారు.
పవన్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. అసలు ఆయనకు ఏపీలో ఆధార్ కార్డు ఉందా? ఇల్లు ఉందా? అని నిలదీశారు. చంద్రబాబు అమలు చేసిన ఒక్క పథకం పేరును పవన్ చెప్పాలన్నారు. చంద్రబాబు, పవన్‌లు ఏపీకి పట్టిన మహమ్మారి అన్నారు.